భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో రికార్డు...: ఏప్రిల్‌లో నమోదు కానున్న జీరోసేల్స్?

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాల చరిత్రలో రికార్డు నమోదు కానున్నది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల వాహనాల డీలర్లు, ఉత్పత్తి కేంద్రాల మూసివేతతో జీరో సేల్స్ రికార్డు కానున్నది.

Auto companies head for zero sales in April, a first for  industry

ముంబై: భారత ఆటోమొబైల్స్ పారిశ్రామిక రంగం ఓ రికార్డు నమోదు కానున్నది. ఏప్రిల్ నెలలో ఆటోమొబైల్స్ ‘జీరో సేల్స్’ రికార్డు చేయనున్నాయి. దేశీయ ఆటోమొబైల్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. 

కరోనా మహమ్మారి ఆటకట్టించడానికి గత నెల 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నది. ప్రాణాంతక కరోనా వ్యాపించకుండా పలు దేశీయ ఆటోమొబైల్ సంస్థలు తమ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు నిలిపివేశాయి. ఆయా సంస్థల డీలర్ షిప్‌లు మూసివేశారు. 

మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ మోటార్స్ అధినేత వేణు శ్రీనివాసన్, మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తదితర ఆటోమొబైల్ ఇండస్ట్రీ లీడర్లు మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వచ్చే నెలలోనూ వాహనాల సేల్స్ పెద్దగా పుంజుకునే అవకాశాలే లేవని స్పష్టం చేశారు. 

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభం ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉన్నదని వివిధ ఆటోమొబైల్స్ సంస్థల అధినేతలు వ్యాఖ్యానించారు. వాహనాల విక్రయాల స్తంభన ఇలాగే కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపైనా, కన్జూమర్ సెంటిమెంట్ మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు.

మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణపైనే మే.. తర్వాత నెలల్లోనూ పరిస్థితుల్లో మెరుగుదల ఆధార పడి ఉంటుందన్నారు. ప్రస్తుత తరుణంలో ఆటోమొబైల్ రంగం తన పనితీరును, మార్గాన్ని మార్చుకోక తప్పదన్నారు. పాత రోజుల్లో ఇన్వెంటరీలపైనే కేంద్రీకరించే వారమని తెలిపారు. వచ్చే నెలలోనూ సేల్స్ విషయంలో అనిశ్చితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఆర్థిక వ్యవస్థ మెరుగు పడినా ఆటోమొబైల్ రంగానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు కోట్ల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశ జీడీపీలో ఆటోమొబైల్స్ రంగం వాటా 8 శాతమైతే, పన్నుల కలెక్షన్ వాటా 15 శాతం అని ఆటోమొబైల్స్ అధినేతలు తెలిపారు. అయితే కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల కార్యకలాపాలకు కేంద్రం అనుమతినిచ్చింది. 

కానీ ఆటోమొబైల్ సంస్థలు తమ ప్లాన్లను పున:ప్రారంభించలేదు. ఎకో సిస్టమ్ సప్లయర్లు, డీలర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. డీలర్లు తమ బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఆటోమొబైల్ సంస్థలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టనున్నాయి. ఒకవేళ వచ్చే నెల మొదటి వారంలో లాక్ డౌన్ ముగిసినా పాక్షికంగానైనా వచ్చేనెల రెండో వారంలో ఉత్పత్తులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ భారత దేశ ఆటోమొబైల్ పరిశ్రమ జపాన్ మార్గాన్ని అనుసరించాల్సి ఉందన్నారు. లోకల్ విడి భాగాలను వాడుతూ జస్ట్ ఇన్ టైం మాన్యుఫాక్చరింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని వేణు శ్రీనివాసన్ తెలిపారు. భవిష్యత్‌లో రిస్క్ తగ్గించుకోవడానికి వీలు అవుతుందని అన్నారు. జస్ట్ ఇన్ టైం మాన్యుఫ్యాక్చరింగ్ వల్ల తక్కువ నిల్వలు మాత్రమే ఉంటాయన్నారు. 

ఒకవేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయకపోతే కేవలం ఆరేడు రోజులకు పరిమితంగా ఇన్వెంటరీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆటో ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. పుణె, గుర్గావ్-మనేసర్, చెన్నై నగరాల్లో ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇక ఆటోమొబైల్ విడి భాగాల తయారీ దారులు కూడా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే లభ్యం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప.. ఆయా విడి భాగాల ఉత్పత్తి ప్రారంభం సాధ్యం కాదని ఓ ఆటోమోటివ్ సంస్థ సీఈఓ పేర్కొన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ డీలర్ల నుంచి డిస్పాచ్ ప్రారంభమైన తర్వాత సప్లయ్ చైన్ కదులుతుందని, దీనికి మూడు నెలల టైం పడుతుందన్నారు. 

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ మార్కెట్ దశలవారీగా తెరుచుకుంటుందన్నారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాల విక్రయానికి కార్యకలాపాలను తప్పనిసరి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాజన్ వధేరా చెప్పారు. 

ఇప్పటికే ఆటోమొబైల్ సంస్థలన్నీ తమ కార్యకలాపాల పున: ప్రారంభానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ సిద్ధం చేసుకున్నాయి. మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో ఇక బిజినెస్ న్యూ డెమెన్షన్‌లో సాగాల్సి ఉందన్నారు. ఉద్యోగుల సేఫ్టీ ఎంతో ముఖ్యం అని తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios