Asianet News TeluguAsianet News Telugu

రెప్పపాటులో 100 కిమీ స్పీడ్: మార్కెట్లోకి ఆస్టోన్ ‘వాంటేజ్’ కారు

రెండేళ్ల క్రితం భారత మార్కెట్లోకి డీబీ 11 మోడల్ కారును ప్రవేశపెట్టిన బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టోన్ మార్టిన్ తాజాగా వాంటేజ్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. కనుమూసి తెరిచే లోపు అంటే రెప్పపాటులో 3.6 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకోవడం దీని స్పెషాలిటీ 

Aston Martin unveils all-new Vantage in India
Author
New Delhi, First Published Oct 27, 2018, 10:30 AM IST

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘ఆస్టోన్‌ మార్టిన్‌’ మరో సరికొత్త వాంటేజ్‌ స్పోర్ట్స్‌ కారును భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.86 కోట్లుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఆస్టోన్‌ మార్టిన్‌ 2016లో డీబీ 11 మోడల్‌ కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, సమీప భవిష్యత్‌లో వరుస కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

వచ్చే కొన్నేళ్లలో మరింత విస్తరించాలని, భారత్‌ తమకు ముఖ్యమైన, బలమైన మార్కెట్ అని ఆస్టోన్‌ మార్టిన్‌ అమ్మకాల హెడ్‌ (దక్షిణ, ఆగ్నేయ ఆసియా) నాన్సీ చెన్‌ పేర్కొన్నారు. కనుక భారత్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. ఇప్పుడిప్పుడే తాము  వృద్ధివైపు పయనిస్తున్న మార్కెట్లపై అధ్యయనం చేశామని నాన్సీ చెన్ చెప్పారు. ఇక్కడ తమ ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాన్సీచెన్‌ తెలిపారు.

వచ్చే ఏడేళ్లలో అంతర్జాతీయంగా ఏడు సరికొత్త మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్టోన్‌ మార్టిన్‌ అమ్మకాల హెడ్‌ నాన్సీ చెన్‌ తెలిపారు. ఈ ఏడు మోడళ్లని భారత్‌లోనూ విడుదల చేస్తామన్నారు. దీనిని బట్టే భారత మార్కెట్‌ తమకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చన్నారు. డీబీ 11 విడుదల తర్వాత భారత్‌లో తమ అమ్మకాలు డబుల్ డిజిట్స్‌కు చేరుకున్నాయని అన్నారు. 

ఆస్టోన్‌ మార్టిన్‌ కార్ల అనుభూతిని ఆస్వాదించేందుకు త్వరలోనే భారత్‌లోనూ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆస్టోన్‌ మార్టిన్‌ అమ్మకాల హెడ్‌ (దక్షిణ, ఆగ్నేయ ఆసియా) నాన్సీ చెన్‌ తెలిపారు. తాజా స్పోర్ట్స్‌ కారు 4లీటర్ల ట్విన్‌ టర్బో వీ8 ఇంజిన్‌తో రానుంది. కన్నుమూసి తెరిచే లోపు అంటే కేవలం 3.6 సెకన్ల వ్యవధిలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ కారుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే డీలర్లు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios