ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్‌కు ప్రచారకర్తగా సచిన్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొన్నది. అయిదేళ్లపాటు ఆయన ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగనున్నారు. అపోలో టైర్స్‌ తొలిసారిగా తమ బ్రాండ్‌కు ఓ సెలెబ్రిటీని ఎంపిక చేసుకోవడం గమనార్హం.

‘అపోలో బ్రాండ్‌ నిజమైన సామర్థ్యాన్ని నిర్మించడంతోనే మా అభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్ముతున్నాం. అందుకే సచిన్‌తో కలిసి ప్రయాణం ప్రారంభిస్తున్నాం. మా గమ్యానికి ఆయన భాగస్వామ్యం తోడ్పడుతుంది’అని అపోలో టైర్స్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ కన్వర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, జర్మన్ బుండెస్లిగా, బొరుస్సియా మాంచెగ్లాబాష్ లతో అపోలో టైర్స్ భాగస్వామ్యం ఉంది. భారతదేశంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) క్లబ్ చెన్నై ఎఫ్సీ ఫ్రాంఛైసీ ప్రిన్సిపల్ స్పాన్సరర్, మినర్వా పంజాబ్ ఎఫ్సీ టైటిల్ స్పాన్సరర్ గా అపొలో టైర్స్ వ్యవహరిస్తోంది. 

నిస్సాన్ చైర్మన్ కార్లోస్ ఘోన్ తొలగింపునకు బోర్డు ఓకే
నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌ తొలగింపునకు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. కష్టాల్లో చిక్కుకున్న నిస్సాన్‌ను తిరిగి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించిన ఈయన.. ఆర్థిక అవకతకవలు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవల అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామం అంతర్జాతీయ వాహన పరిశ్రమను కుదిపేసింది. కంపెనీ సొమ్మును కార్లోస్‌ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారన్న ఆరోపణలపై గత కొన్ని నెలలుగా అంతర్గత విచారణ జరుగుతోంది. ఈ విచారణ నివేదికను పూర్తిగా సమీక్షించిన అనంతరం కార్లోస్‌ ఘోన్‌ను బోర్డు ఛైర్మన్‌గా తొలగించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.