Asianet News TeluguAsianet News Telugu

8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం: విద్యుత్ వాహనాలదే ఫ్యూచర్!!

యావత్ ప్రపంచం విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నది. అందులో భారత్ కూడా భాగస్వామి కావడానికి ఏర్పాట్లు చేస్తున్నది. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ కార్పొరేట్ దిగ్గజం ఏబీబీ 8 నిమిషాల్లో బ్యాటరీని చార్జింగ్ చేసే సామర్థ్యం గల పరికరాన్ని ‘మూవ్’ సమ్మిట్‌లో ప్రదర్శించింది. 
 

ABB unveils fast charging system to power a car in 8 mins for 200 km
Author
New Delhi, First Published Sep 8, 2018, 1:15 PM IST

న్యూఢిల్లీ: కాలుష్య రహితంగా, భూతాప నివారణ కోసం విద్యుత్ వినియోగ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాలదే భవిష్యత్ అనే సంకేతాలు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. విద్యుత్ వాహనాలతో ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఆదా చేయ వచ్చునని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌ ప్రముఖ టెక్నాలజీ కం విద్యుత్ పరికరాల సంస్థ ఏసియా బ్రౌన్ బోవెరీ (ఏబీబీ) సంస్థ అత్యంత వేగవంతమైన చార్జింగ్ సిస్టమ్‌ను గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్‌లో ఆవిష్కరించింది.
కేవలం ఎనిమిది నిమిషాల్లో విద్యుత్ బ్యాటరీ చార్జింగ్‌తో ఒకసారి చార్జింగ్ చేయించుకుంటే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 

తొలిసారి వేగవంతమైన చార్జింగ్ వ్యవస్థ ఆవిష్కరణ
భారత్‌లో తొలిసారిగా ఏబీబీ టెర్రా హెచ్‌పీ అత్యంత వేగవంతమైన చార్జింగ్ వ్యవస్థను ఆవిష్కరించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. జాతీయ రహదారుల్లో ఉన్న రెస్ట్ స్టాప్స్, పెట్రోల్ బంకుల్లో సులువుగా బిగించుకోవడానికి వీలుగా ఈ చార్జింగ్ స్టేషన్లను రూపొందించింది. ఈ సందర్భంగా ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పిస్స్‌హోఫర్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థలో ఈ-మొబిలిటీ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఈ స్టేషన్లను రూపొందించినట్లు చెప్పారు. 

మేకిన్ ఇండియాతో కలిసి ప్రగతి పథంలో ఇలా
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా పారిశ్రామిక ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పిస్స్‌హోఫర్ తెలిపారు. దీంతో స్మార్ట్‌గా కాలుష్యాన్ని నియంత్రించే వీలుంటుందని చెప్పారు. కేంద్రం, నీతి ఆయోగ్, వినియోగదారులు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లతో కలిసి భారత వృద్ధికి ఏబీబీ తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంస్థ 68 దేశాల్లో 8 వేల స్టేషన్లను నెలకొల్పింది.

జర్మనీ హానోవర్ ఫెయిర్‌లో టెర్రా హైపవర్ ఈవీ చార్జర్ 
కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్‌ ఇండస్ట్రీ ఫెయిర్‌లో నూతన టెర్రా హైపవర్‌ ఈవీ చార్జర్‌ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్‌తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఎలక్ట్రిక్‌ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్‌గా ఉన్నామని, టోసా సిస్టమ్‌ కేవలం 20 సెకండ్ల బరస్ట్‌తో ఓ బస్సు ఏబీబీ సీఈఓ ఉల్రిచ్ స్పిస్స్‌హోఫర్ చెప్పారు. 

వచ్చే నెలలో సుజుకీ విద్యుత్ వాహన పరీక్షలు
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్‌ రూపొందిస్తున్న విద్యుత్ కారు వచ్చే నెలలో రోడ్డెక్కనున్నది. 2020 నాటికి దేశీయ మార్కెట్లోకి విద్యుత్ వాహనాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అక్టోబర్‌లో ఈ వాహనాన్ని పరీక్షించనున్నట్లు కంపెనీ చైర్మన్ ఒసాము సుజుకీ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే లిథియం-ఇయాన్ బ్యాటరీలను గుజరాత్‌లో ఉన్న ప్లాంట్‌లో 2020 నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతీయ వాతావరణ, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందిస్తున్నట్లు గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ మూవ్‌లో పేర్కొన్నారు. 

తగినంత చార్జింగ్ స్టేషన్లతోనే విద్యుత్ వాహనాల వాడకం పెరుగుదల
తగినన్ని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే భారత్‌లో విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతుందని సుజుకి చైర్మన్ ఒసాము సుజికి పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. విద్యుత్ వాహనాల వాడకం అంతంతే మాత్రమే భారత్‌లో 2030 నాటికి 30 శాతానికి చేరుకోవడం కష్టమేనన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సూచించారు. దేశీయ అవసరాల నిమిత్తం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించడం జరిగిందని టాటా మోటార్స్ ఎండీ గ్యూంటర్ బట్స్‌చెక్ తెలిపారు. మొబిలిటీ రంగంలో మార్పులకు అనుగుణంగా సంస్థ నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నదని, తద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలుగనున్నదని వ్యాఖ్యానించారు. ఎంజీ మోటార్స్ ఇండియాతో నూతన విద్యుత్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు ఎస్‌ఏఐసీ ప్రెసిడెంట్ ఛెన్ జిక్సిన్ తెలిపారు. 2020 నాటికి భారత్‌లో వ్యాపార విస్తరణకు 500 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు.

ఆటోమొబైల్ పరిశ్రమ మైండ్‌సెట్ మారాలి
ఆటోమొబైల్ సంస్థల మైండ్‌సెట్ మారాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భవిష్యత్ అవసరాలకు మరింత ప్రాధాన్యం ఇనివ్వాలని, స్పష్టమైన విధానాలతో వచ్చిన సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు మూవ్ సమ్మిట్‌లో మంత్రి చెప్పారు. చమురు దిగుమతిని, కాలుష్య నియంత్రణకు కేంద్రం ప్రత్యేక పాలసీని ప్రకటించిందని, ఇదే సమయంలో ప్రత్యామ్నాయ పరిస్థితులను ప్రోత్సహించడంలో భాగంగా ఫ్యూయల్ టెక్నాలజీలైన బయోఫ్యూయల్, ఎలక్ట్రిక్ మొబిలిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios