Asianet News TeluguAsianet News Telugu

2024కల్లా 150సీసీ టూవీలర్లు.. అంతకుముందే త్రీ వీలర్స్‌పై నిషేధం?

మరో నాలుగేళ్లలో దేశీయంగా ప్రధాన నగరాలన్నింటిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ నాటికి 1500 సీసీ సామర్థ్యానికి పరిమితమైన ట్రూ వీలర్స్, అంతకు ముందేడాది 2023 నాటికి త్రీవీలర్ల వినియోగం రద్దు దిశగా చర్యలు ప్రతిపాదిస్తోంది. దీనికి పెరిగిన వాతావరణ కాలుష్యమే కారణం అని నిపుణులు చెబుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి పెట్రోల్, డీజిల్, గ్యాసోలైన్ ఆధారిత వాహనాల వినియోగంపై పూర్తిగా నిషేధం అమలు చేయాలని కేంద్రం ముందుకు సాగుతోంది. 

150cc 2 Wheelers Ban In India Post April 2025
Author
New Delhi, First Published May 31, 2019, 12:05 PM IST

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా 150సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఆధారిత ద్విచక్ర వాహనాలపై పూర్తిగా నిషేధం విధించాలని యోచిస్తున్నది. 2025 ఏప్రిల్ నాటికి ఈ నిషేధాన్ని పూర్తిగా అమల్లోకి తేవాలని చూస్తున్నది. 

అంతకంటే ముందే త్రిచక్ర వాహనాలనూ నిషేధించాలని కేంద్ర సర్కార్ భావిస్తున్నది. అంటే 2023 ఏప్రిల్‌కల్లా పెట్రోల్, డీజిల్ ఇతరత్రా గ్యాసోలైన్ ఇంధన ఆధారిత త్రిచక్ర వాహనాల వినియోగం రద్దు చేయాలని ఆలోచిస్తున్నది. 

ప్రస్తుతం ఈ టూవీలర్, త్రీవీలర్ వాహనాల వార్షిక అమ్మకాలు 2 కోట్లపైనే ఉండటం గమనార్హం. దేశీయ రోడ్లపై 9 నెలల కాలంలో తిరిగే వాహనాల సంఖ్య కంటే ఇది ఎక్కువ.

ప్రభుత్వం ఈ టూవీలర్, త్రీవీలర్లను నిషేధించినా.. వాటి వినియోగదారులపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదు. దీనికి కారణం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే బీఎస్-6 వాహనాలు మార్కెట్‌లోకి రానుండటం. ఇప్పుడు 150సీసీ వరకు ఉన్న వాహనాలన్నీ బీఎస్-6కు దిగువ శ్రేణివే. 

2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 వాహనాలనే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించడంతో వాహన తయారీ సంస్థలు అంతకు తక్కువ శ్రేణి వాహన విక్రయాలను ఇప్పటికే చాలావరకు తగ్గించేశాయి. దీంతో డెడ్‌లైన్ 2025 ఏప్రిల్ నాటికి సదరు వాహనాల కాలం దాదాపు తీరిపోయే వీలు ఉన్నది.

కనుక 150 సీసీ టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ పై నిషేధం విధించినా వినియోగదారులకు పెద్ద నష్టం ఉండదనే అనుకోవాలి. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్-10 నగరాల్లో భారతీయ నగరాలూ ఉండటంతో బీఎస్-5 శ్రేణిని కేంద్రం తొలగించింది. ఏకంగా బీఎస్-6ను ప్రవేశపెట్టింది.

వాతావరణంలో కాలుష్యం స్థాయి ఏటేటా విపరీతంగా పెరిగిపోతుండటంతో  విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ఎప్పట్నుంచో ప్రోత్సహిస్తున్నాయి. అయితే పెట్రో ఆధారిత వాహనాలతో పోల్చితే వీటి వేగం తక్కువగా ఉండటం, అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో వీటికి ఆదరణ అంతంతమాత్రంగానే లభిస్తున్నది. 

150సీసీ వరకు ఉన్న పెట్రో ఆధారిత టూవీలర్లపై నిషేధం విధిస్తే విద్యుత్ ఆధారిత వాహనాల అమ్మకాలు పెరిగే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిషేధం నిర్ణయానికి చట్టబద్ధత లభిస్తే, కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, రిక్షాలు అమ్ముడవుతాయని అంటున్నారు. 

కాలుష్య నియంత్రణలో భాగంగా పెట్రోల్, డీజిల్ ఆధారిత రవాణా వాహనాలు, సిటీ బస్సులు, స్కూల్ బస్సులపైనా వేటు వేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ విషయమై సంబంధిత వర్గాలతో చర్చలు కూడా నడుస్తున్నాయి. వీలైనంత త్వరలోనే మొత్తం దేశీయ ఆటో రంగాన్ని విద్యుత్ ఆధారిత వాహనాల వైపు నడిపించాలన్న దృక్పథం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇప్పటిదాకా ఎలాంటి పన్ను ప్రోత్సాహకాలు లేని ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి దారులకూ పలు ప్రోత్సాహకాలు ఇవ్వాలనీ కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ఆథర్ వంటి పలు బ్రాండ్ల నుంచి మాత్రమే కాస్తోకూస్తో విద్యుత్ ఆధారిత వాహనాలు మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. 
ఈ ఏడాది చివరికల్లా బజాజ్, ఆ తర్వాత మహీంద్రా విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరికొన్ని సంస్థలూ ఎలక్ట్రిక్ బాట పడుతాయన్న ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios