డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహానవమి. ఈ రోజు జగదంబను ఆరాధించాలి. తొమ్మిదిరోజులు చేయలేనివారు సప్తమి నుండి మూడు రోజులు పూజలు చేస్తారు. అలా కుడా కుదరని పక్షంలో ఈ మహా నవమి రోజైనా తప్పక అమ్మవారిని పూజించాలి. దసరా పూజలకు ఇదే ప్రధానం. విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియజేయబడినది. ప్రధానపూజ నవమి రోజే చేయాలి. నవమి పూజ చేసిన వారే దశమి రోజు పున: పూజ చేస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ''మహర్నవమి'' అంటారు. ''దుర్గాష్టమి'', ''విజయదశమి'' లాగే ''మహర్నవమి'' కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.

మహార్నవమి రోజున ఇతర పిండివంటలతోబాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు.

తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు.

అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ మహర్నవమి రోజున దేవీ ఆలయాలు భక్తులరద్దీతో కిక్కిరిసి ఉంటాయి. విజయవాడ, కలకత్త, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో ఉన్న కనకదుర్గ ఆలయాలకు దేశం నలుమూలల నుండీ లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

సింహవాహనారూఢై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు. అన్ని అవతారాలలోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులని సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. అందుకే దీనికి ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే ఇరవైనాలుగు నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహర్నవమి అని పిలవబడుతుంది. 

ఈ రోజు మరొక విశేషం ఆయుధ పూజ. దుర్గాష్టమి, విజయదశమి లాగే 'మహర్నవమి' కూడా అమ్మవారికి విశేషమైన రోజు మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. అమ్మ దుర్గాదేవి అనేకావతారాల్లో అపరాజితాదేవి దుర్మార్గులను ఓడించి సన్మార్గులకు సుఖజీవనాన్ని అందించే అవతారం అపరాజిత - అంటే ఏవరి చేతా ఓడించబడనిది అని అర్ధం.