Asianet News TeluguAsianet News Telugu

మహామాఘి - మాఘ పౌర్ణమి

మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ సంప్రదాయం.

speciality of magha Pournami
Author
Hyderabad, First Published Feb 11, 2020, 2:36 PM IST

మాఘ స్నానంతో పాప పరిహారం, ఆరోగ్య ప్రాప్తి! మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి.ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి

చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ సంప్రదాయం. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి- మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని ని పురాణ కథనం.

మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. మాఘ స్నానాలకు అధిష్ఠానదేవత సూర్యనారాయణుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా ఆరేళ్లపాటు చేసిన అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. బావినీటితో స్నానం వల్ల పన్నెండేళ్ల పుణ్యఫలం, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. దివ్య తీర్థాలను స్మరిస్తూ పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపజేసేది. అందుకే తెలుగు నెలల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవుడికి ఎంతో ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడు, విష్ణువు ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

వివాహాది శుభకార్యాలకు ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాఘమాసంలో స్నానానికే అధిక ప్రాధాన్యత. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయి. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.

మాఘ పౌర్ణమినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం.

స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది.

మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

speciality of magha Pournami

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

Follow Us:
Download App:
  • android
  • ios