అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలు కావడంలో జనసేన కీలకపాత్ర పోషించింది. జనసేన ఓట్ల చీలిక కారణంగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం మూడు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకొంది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన ఎంపీ స్థానాల్లో టీడీపీ ఓటమికి జనసేన చీల్చిన ఓట్ల కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమలాపురం ఎంపీ స్థానంలో జనసేనకు 2,10,126 ఓట్లు దక్కాయి. ఈ స్థానంలో సుమారు 40వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి జీఎంసీ బాలయోగి తనయుడు ఓటమి పాలయ్యాడు. అనకాపల్లి ఎంపీ స్థానంలో జనసేనకు 59636 ఓట్లు దక్కాయి. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్ధి సత్యవతికి 4,15,215 టీడీపీ అభ్యర్థి 3,50,312 ఓట్లు వచ్చాయి.

బాపట్లలో వైసీపీ అభ్యర్ధికి 5,22,896 ఓట్లు వస్తే  టీడీపీ అభ్యర్ధి శ్రీరాం మాల్యాద్రికి 5,04,225 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో జనసేనకు 37,361 ఓట్లు దక్కాయి.కాకినాడలో వైసీపీ అభ్యర్ధికి 4,38,619 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌కు 4,17,896 ఓట్లు దక్కాయి.ఈ స్థానంలో 1,08,220 ఓట్లను జనసేన అభ్యర్థికి వచ్చాయి.

మచిలీపట్టణంలో వైసీపీ అభ్యర్థికి 5,32,119 ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థికి 4,76,337 ఓట్లు వచ్చాయి.  ఈ స్థానంలో జనసేన అభ్యర్థికి 1,07,823 ఓట్లు దక్కాయి. నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుకు 3,76,126 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 3,56,720 ఓట్లు దక్కాయి. ఈ స్థానంలో జనసేన అభ్యర్థి నాగబాబుకు 2,13,109 ఓట్లు వచ్చాయి.

రాజమండ్రి ఎంపీ స్థానంలో  వైసీపీ అభ్యర్ధి 4,77,948 ఓట్లు దక్కించుకొన్నారు. టీడీపీ అభ్యర్థికి కేవలం3,86,315 ఓట్లు మాత్రమే దక్కాయి.జనసేనకు 1,21,659 ఓట్లు దక్కాయి. విశాఖపట్టణంలో వైసీపీ అభ్యర్ధికి 2,70,018 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి భరత్‌కు 265913 వచ్చాయి. ఈ స్థానంలో జనసేన అభ్యర్థికి 1,74,247 ఓట్లు దక్కాయి. జనసేన అభ్యర్థులు చీల్చిన ఓట్లు టీడీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.