విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య రహస్య భేటీ ఒకటి జరిగినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. విజయవాడ సమీపంలో దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఇరువురి మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. 

దశావతార ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పవన్, చంద్రబాబు కలిసిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి వారిద్దరు ఇటీవల హాజరైనట్లు తెలుస్తోంది.  మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల వారిద్దరు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు చెబుతున్నారు. 

సచ్చిదానంద ఆహ్వానం మేరకు వారిద్దరు ఆలయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఏకాంత చర్చలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల ఎన్నికల పోలింగ్ సరళిపై వారు చర్చించుకున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

వారిరువురి భేటీ సచ్చిదానంద ఏర్పాటుతోనే జరిగినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటే ఏం చేయాలనే విషయాలపై కూడా వారిద్దరు మాట్లాడుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.