విజయవాడ: 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది తానేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యేది తానేనని ఆయన శనివారం విజయవాడలో అన్నారు విజయవాడలో గూండా అనేవాడు కనపడకూడదని ఆయన అన్నారు. 

ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పారిపోయిందని,  బీజేపీని అడగడానికి వైసీపీ నేతలకు గొంతులు రావని, ఏమన్నా అంటే సీబీఐ దాడులు చేస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీది వ్యాపారంతో కూడిన రాజకీయమని ధ్వజమెత్తారు. టీడీపీలో రౌడీలు ఎమ్మెల్యేలు అవుతున్నారని, ఉమ్మడి రాజధానిని చంద్రబాబు వదిలేసి వచ్చారని ఆయన అన్నారు.
 
తనను టీడీపీ పార్టనర్‌ అని వైసిపి నేతలు అంటున్నారని, కన పార్టనర్స్ సీపీఎం, సీపీఐ, బీఎస్పీలని ఆయన చెప్పారు. పేపర్‌, టీవీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. 

తెలంగాణలో మీకు, కేసీఆర్‌కు సంబంధాలు ఉన్నాయా? లేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదని, జనసేన ధైర్యంగా పోటీ చేస్తుంటే మీరెందుకు చేయడం లేదని అన్నారు. 

జగన్‌-కేసీఆర్‌ కుమ్మక్కయ్యారనేందుకు ఇంతకంటే ఉదాహరణ కావాలా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో కేసీఆర్‌కు ఏం సంబంధమని అడిగారు. తమను బూతులు తిట్టిన కేసీఆర్‌కి ఇక్కడేం పని అని అన్నారు.