అమరావతి: పవన్ కల్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి, జనసేనను పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చేందుకు ముందుకు రావడం చాలా మందిని సంతోషపెట్టింది. ఒక వర్గం యువతలో ఉత్సాహాన్ని ప్రోది చేసింది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయినట్లేనని భావించారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది మరి.

అయితే, ప్రస్తుత ఎన్నికలు పవన్ కల్యాణ్ ఆశలకు గండికొట్టినట్లేనని భావించాలి. ఇంటిని పూర్తి స్థాయిలో చక్కబెట్టుకుని సమరానికి దిగే లోపలే ఎన్నికలు ముంచుకొచ్చి ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. 

సంస్థాగతంగా పూర్తి స్థాయి నిర్మాణాన్ని జనసేన ఇప్పటికీ సంతరించుకోలేదు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అభ్యర్థుల ఖరారు తొలి దశలోనే ఉంది. ఈ స్థితిలో పూర్తి స్థాయిలో సమరానికి సిద్ధపడే ఆయుధాలేవీ ఆయన సమకూర్చుకోలేదనే చెప్పాలి.

నిజానికి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తానని పవన్ కల్యాణ్ ధీమాగా చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. తనది దీర్ఘకాలిక పోరాటమని, ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యం కాదని ఆయన అంటూ వచ్చారు. తాము ముఖ్యమంత్రిని కావాలని రాజకీయాల్లోకి రాలేదని కూడా చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరగాల్సి ఉండగా, అది ముఖాముఖి పోటీగా మాత్రమే జరిగే వాతావరణం నెలకొని ఉంది. చంద్రబాబు, జగన్ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం, వైసిపిలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. కొన్ని చోట్ల విజయాలు కూడా సాధించవచ్చు.

జనసేన మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి అడుగు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి గానీ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం మాత్రమే సందేహంగానే ఉంది.