Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్టు: అప్పుడు వైఎస్ నెగ్గారు, ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా

అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో పలు అస్త్రాలను సంధించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసింది తామేనని చెప్పుకుని ఓట్లు కొల్లగొట్టాలని చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యూహ రచన చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టును ఒక ఆయుధంగా మలచుకోవాలని చూస్తోంది. 

Will Polavaram issue helps Chnadrababu to regain power in AP?
Author
Polavaram Project, First Published Mar 13, 2019, 2:47 PM IST

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతోపాటు ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. దాదాపు అభ్యర్థుల జాబితా విడుదల పనిలో నిమగ్నమయ్యాయి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు. 

అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో పలు అస్త్రాలను సంధించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసింది తామేనని చెప్పుకుని ఓట్లు కొల్లగొట్టాలని చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యూహ రచన చేస్తోంది. 

రాబోయే ఎన్నికల్లో పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టును ఒక ఆయుధంగా మలచుకోవాలని చూస్తోంది. అయితే పోలవరం ప్రాజెక్టు అధికార తెలుగుదేశం పార్టీకి ఓట్లు రాల్చుతోందా...ఎంతవరకు పార్టీకి లబ్ధి చేకూరనుందో ఓసారి చూద్దాం. 

పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాధారంగా చెప్పుకోవాలి. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సిరులు పండుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన 1930లోనే వచ్చింది. 

సర్ అర్థర్ కాటన్ భారతదేశంపు నదుల అనుసంధానం గురించి ముందే ఊహించి పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే ఎవరూ ఈ ప్రతిపాదనపై పట్టించుకోలేదు. ఆ తర్వాత 1941లో మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీర్, దివాన్ బహుదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరి నదిపై పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. 

1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కేఏల్ రావు మళ్లీ పోలవరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా పేరు కూడా పెట్టారు. 130 మీటర్ల ఎత్తు ఉన్న ఆనకట్ట ఎడమవైపు విశాఖపట్నం ఓడరేవు వరకు 209 కిలోమీటర్ల మేర పొడవైన కాలువ, కుడివైపున కృష్ణానది వరకు 200కిలోమీటర్ల మేర పొడవైన కాలువ నిర్మించాలని డిజైన్ రూపొందించారు. 

అలాగే గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల మేర పొడవైన కాలువ మరియు 150 మెగా వాట్ లసామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోపాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆనాటి ప్రభుత్వాలు నిర్మాణంపై వెనకడుగు వేశాయి. 

ప్రారంభంలో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.129 కోట్లు. ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉందంటూ ఆనాడు చేపట్టలేదు. అయితే 1953లో వచ్చిన వరదలు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం యెుక్క పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ప్రాజెక్టు నిర్మాణంలో మళ్లీ కదలిక వచ్చింది. 

1976లో ఈ ప్రాజెక్టుపై కదలిక రాగా 1978వ సంవత్సరంలో విస్తృత స్థాయి నివేదిక సమర్పించడంతో 1981లో శంకుస్థాపన జరిగింది. బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 150 అడుగులు ఉండాలని, స్పిల్ వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు, ముంపుకు గురయ్యే ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ ఒప్పందం చేసుకున్నాయి.  

1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు తలెత్తడంతో 1986లో మరో నివేదికను రూపొందించారు. 1985-86లో ప్రాజెక్టు అంచనాల వ్యవయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు. 

శంకు స్థాపన తర్వాత ప్రాజెక్టు పనుల్లో అంతగా కదలిక రాలేదు. 2004లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించారు. దీంతో మళ్లీ పోలవరం ప్రాజెక్టుపనుల్లో కదలిక వచ్చినట్లైంది. పోలవరం ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేపట్టారు. 

రామపాదసాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువున పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 2,454 మీటర్లు పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1128 మీటర్ల పొడవైన స్పిల్ వేను నిర్మించాలని నిర్ణయించారు. 

2009 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. ఉభయగోదావరితోపాటు ఉత్తరాంధ్రలో పోలవరం ప్రాజెక్టు దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం చేపట్టారు. 

దశాబ్ధాల కాలంగా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టును చేపట్టిన ఘనత తమదేనని వైఎస్ ఘంటాపథంగా చెప్పుకొచ్చారు.  పోలవరం పూర్తైతే కృష్ణ, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో సుమారు 7.21 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చునని ప్రచారంలో చెప్పుకొచ్చారు. 

ప్రకాశం బ్యారేజి ఎగువన 12 లక్షల ఎకరాలకు 80 టీఎంసీల నీరు అందించవచ్చునంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా చెప్పుకొచ్చారు. వీటితోపాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని భవిష్యత్ లో విద్యుత్ సమస్య తలెత్తదని కూడా చెప్పారు. 

ఇకపోతే విశాఖపట్టణానికి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాల నిమిత్తం 80 టీఎంసీల నీరు అందించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో వచ్చినా ఆ వేవ్ ను సైతం తట్టుకుని అధికారంలోకి వచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 
 
పోలవరం ప్రాజెక్టులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం పోలవరం ప్రాజెక్టును ఎన్నికల ప్రధాన అస్త్రంగా చేసుకుని సంధించాలని ప్రయత్నిస్తోంది. 

ఇప్పటికే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత తమ పార్టీకి ప్రభుత్వానికే చెందుతుందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత తమదేనని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పుకొస్తున్నారు. 

కేంద్రం సహకరించకపోవడంతో ఏపీ ప్రభుత్వమే వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. 2014లో కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ కేంద్రం సహకరించడం లేదని చెప్తున్నారు. 

అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఘనత కూడా తమదేనని చెప్పుకొచ్చారు. అయితే పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేస్తోంది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన ప్రతీ పైసా కేంద్రానికి చెందినవేనని బీజేపీ చెప్పుకొస్తోంది. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించిందని దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని ప్రకటించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆగమేఘాల మీద ప్రాజెక్టు పనులు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 

కేవలం తన బినామీ కంపెనీకు కాంట్రాక్ట్లు అప్పగించి దోచుకుందామనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టారంటూ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష  పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పోలవరం ప్రాజెక్టు అంశంలో టీడీపీ నాటకాలు ఆడుతోందంటూ ఆరోపిస్తోంది. 

పోలవరం ప్రాజెక్టును ఒక అవినీతి ప్రాజెక్టుగా టీడీపీ మార్చేసిందని ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో పనిని ఒక్కోవేడుకగా చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కోట్లు దోచుకుంటున్నారంటూ దుయ్యబుట్టారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వేడుకలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తోందంటూ ఆరోపిస్తోంది. 

2018 నవంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాసుకోండి అంటూ నిండు సభలో భారీ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. కానీ నేటికి ఆ ప్రాజెక్టును పూర్తి చెయ్యలేదు. 2019 జూన్ కల్లా పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. 

కేవలం దోచుకోవడానికే చంద్రబాబు ఆగమేఘాలమీద ప్రాజెక్టును ప్రారంభించారని ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను తన బినామీ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారని తెలిపారు. ఆ అవినీతి సొమ్ముతో రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో రూ.400కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపిస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అది చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడుతోందని అటు ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. 

కుడి, ఎడమ కాల్వ పనులకు సంబంధించి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టిందని ఆరోపించారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నా పోలవరం ప్రాజెక్టును మాత్రం పూర్తి చేసేశామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటోంది. 

ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊపరినిస్తోందా...ఓట్లు రాబడుతోందా అన్నది వేచి చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రధాన అస్త్రంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.  


 

Follow Us:
Download App:
  • android
  • ios