శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ సమస్య  ప్రతి ఎన్నికల్లో పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతోంది.ఏళ్ల తరబడి ఈ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నాలు సాగాలని  స్థానికులు కోరుతున్నారు.

గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. హార్వర్డ్ వైద్య బృందంతో చర్చించారు. ఈ వైద్య బృందంతో వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.  

2019 ఎన్నికల్లో మరోసారి ఉద్దానం కిడ్నీ బాధితుల అంశం తెరమీదికి రానుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారంగా ఇప్పటివరకు ఉద్ధానం ప్రాంతంలో సుమారు 15, 623 మంది కిడ్నీ వ్యాధిన పడ్డారు. వీరికి తోడుగా ప్రస్తుతం మరో 13,093 మందికి కూడ ఈ వ్యాధి సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఒడిశా రాష్ట్రానికి సరిహద్దులో శ్రీకాకుళం జిల్లా ఉంటుంది. ఈ జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు.

సాధారణంగా షుగర్, బీపీ ఉంటే కిడ్నీ వ్యాధులు వస్తాయి. కానీ,ఈ ప్రాంతంలోని ప్రజలకు  బీపీ, షుగర్ లేకున్నా కూడ  కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. 1993లో డాక్టర్ కృష్ణమూర్తి ఈ విషయాన్ని గుర్తించాడు. 

సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగ పట్నం గ్రామాల్లోని ప్రతి ఇంట్లో ఒక్క కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు.సాధారణ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భిన్నంగా ఈ వ్యాధి ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ ప్రత్యేక వ్యాధికి 'క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌' అని పేరు పెట్టింది. ''ఉద్దానం నెఫ్రోపతి'' అని కూడా దీనిని పిలుస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 9 నుండగి 12 మంది కిడ్నీ వ్యాధికి గురౌతున్నారు.

ఈ ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో వైపు ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన  వైద్యుల బృందం పరిశీలించింది.

అయితే ఈ ప్రాంత ప్రజలకు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని పరిశీలించేందుకు సమగ్రంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.