Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదా: కథా కమామిషు ఇదీ....

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార అస్త్రంగా మారనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Simple facts about Special Status states
Author
Amaravathi, First Published Mar 12, 2019, 5:08 PM IST

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార అస్త్రంగా మారనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపిస్తున్నాడు. ప్రత్యేక హోదాను తాను ఏనాడూ వద్దని చెప్పలేదని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో బీజేపీ మోసం చేసిందని బాబు విమర్శిస్తున్నాడు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆనాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఆనాడు రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.  అయితే ఆ సమయంలో రాజ్యసభలో ఉన్న బీజేపీ నేతలు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం పార్టీలకు ప్రచార అస్త్రంగా మారనుంది.2014 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొంది. ఈ రెండు పార్టీలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేశాయి. కేంద్రంలో టీడీపీ, ఏపీలో బీజేపీ భాగస్వామ్యులుగా చేరారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ కోరింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన విషయాన్ని కూడ చంద్రబాబునాయుడు గుర్తు చేస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో తాము ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.  కానీ, అదే సమయంలో తాము ప్రత్యేక హోదాను వద్దనుకోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా అంటే ఏమిటీ

 పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టం రూపొందితే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతోంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఆర్థికసాయాన్ని అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు.కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది.

ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలిస్తారు. ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరిస్తారు.అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి  తెలంగాణ విడిపోవడంతో  రెవిన్యూ పరంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.14వ, ఆర్థిక సంఘం కూడ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసిందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

 దేశంలో 1969 నుండి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాను అమలు చేస్తున్నారు.5వ, ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది.5వ, ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 1969లో ప్రత్యేక హోదా కల్పించే పద్దతి అమలుకు శ్రీకారం చుట్టారు.

తొలుత దేశంలోని అసోం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లకు ప్రత్యేక హోదాను అమలు చేశారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలకు హోదాను వర్తింపజేశారు.అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలు చేస్తున్నారు.

ప్రత్యేక కేటగిరి అంటే ఏమిటీ

ప్రత్యేక హోదాకు ప్రత్యేక కేటగిరికి చాలా తేడా ఉంది, ప్రత్యేక హోదా అంటే పార్లమెంట్‌లో చట్టబద్దత పొంది ఉండడం, ప్రత్యేక కేటగిరి అంటే ఏదో ఒక రాష్ట్రానికి
కేంద్రం నుండి ఇచ్చే సహయంలో ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడంగా చెబుతారు.

ప్రత్యేక హోదాకు అర్హతలేమిటి

ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రత్యేక హోదాను కేంద్రం కొనసాగిస్తుంది.  దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా ప్రత్యేక హోదా కల్పించారు. పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు సరిగాలేని ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాను అమలు చేస్తున్నారు.

జనసాంద్రత తక్కువగా ఉండడంతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను అమలుకు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఆయా రాష్ట్రాల్లో మౌళిక వసతులు సరిగా లేకుండా ఉండాలి.

అంతేకాదు  ఆర్థికంగా వనరులున్నా కూడ ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతాలుగా ఉండాలి.విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలై ఉండాలి. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాను అమలు చేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios