విశాఖ:విశాఖపట్టణం జిల్లాలోని విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తే అదే పార్టీకి చెందిన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే సెంటిమెంట్ కొనసాగుతోంది. 

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖ-1 నియోజకవర్గంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంగా మారింది. 2009 అసెంబ్లీ ఎన్నికల నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి విజయం సాధించిన అభ్యర్థికి చెందిన పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంది.

1983లో విశాఖ నియోజకవర్గంలో  గ్రంధి మాధవి టీడీపీ అభ్యర్ధి గా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అల్లు భానుమతిని టీడీపీ బరిలోకి దించింది.  ఈ ఎన్నికల్లో కూడ టీడీపీ అధికారంలోకి వచ్చింది.

1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఒకటో నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈటి విజయలక్ష్మి పోటీ చేసి  విజయం సాధించారు. ఆ సమయంలో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

1994 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎస్.ఏ. రెహమాన్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీ బీజేపీకి కేటాయించింది. ఈ స్థానంలో ఆనాడు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కంభంపాటి హరిబాబు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

2004 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.2005 లో డిసెంబర్‌ లో అనారోగ్యంతో ద్రోణంరాజు సత్యనారాయణ మృతి చెందారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ గెలుపొందారు.2014 లో జరిగిన ఎన్నికల్లో వాసుపల్లి గణేష్‌కుమార్ టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించింది.