ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎంతగా ప్రభావం చూపిస్తుందో సెంటిమెంట్లు కూడా అలాగే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. స్వతంత్ర భారతంలో జరిగిన అన్ని ఎన్నికలలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది.

ఇక తెలుగుదేశం పార్టీకి బాపట్ల నియోజకవర్గంతో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటే టీడీపీ తప్పక గెలుస్తుందనే నమ్మకం బాగా ఉంది. ఫలితాలు కూడా అందుకు తగినట్లుగా వస్తుండటంతో నేతలు సైతం దీనిని ఫాలో అయిపోతున్నారు.

టీడీపీ ఆవిర్భావం, ఎన్టీఆర్ ఛరిష్మా ప్రభావంతో 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునాయసంగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో టీడీపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధితో పాటు ఆ పార్టీకే చెందిన రెబల్ అభ్యర్ధి రంగంలో నిలిచారు.

1989లో కాంగ్రెస్, టీడీపీలు ముఖాముఖి తలపడటంతో కాంగ్రెస్ విజయం సాధించింది. 1994లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మరోకరిని ఎంపిక చేయడంతో అప్పటి చీరాల ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీపై కోపంతో రెబల్‌గా పోటీ చేశారు.

త్రిముఖ పోరు రావడంతో టీడీపీ అభ్యర్ధి ముప్పలనేని శేషగిరిరావు విజయం సాధించారు. 1999లో మరోసారి త్రిముఖపోటీ చోటు చేసుకోవడంతో టీడీపీ అభ్యర్ధి అనంతవర్మ విజయ దుందుభి మోగించారు.

2004, 2009లో కాంగ్రెస్, టీడీపీ ముఖాముఖి తలపడటంతో సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అవలీలగా గెలుపొంది మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2014లోనూ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి, టీడీపీ అభ్యర్థి అన్నం సతీశ్‌ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.

అయితే సెంటిమెంట్ బలంగా పనిచేయడంతో టీడీపీ పవనాలను సైతం తట్టుకుని వైసీపీ గెలుపొందింది. దీనిని బట్టి 1983లో తప్పించి ముఖాముఖి పోరులో టీడీపీ గెలుపొందిన దాఖలాలు లేవు.

ఈసారి టీడీపీ తరపున ఎమ్మెల్సీ అన్నం సతీశ్ కానీ నరేంద్ర వర్మగాని బరిలోకి దిగే అవకాశం ఉంది. సెంటిమెంట్‌ దృష్ట్యా ఇద్దరు నేతలు త్రిముఖ పోటీ జరగాలని భావిస్తున్నారు. మరి ఈసారి బాపట్ల సెంటిమెంట్ తెలుగుదేశంపై ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.