ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, నవ్యాంధ్ర అయినా రాజకీయాలకు రాజధాని అంటే కృష్ణాజిల్లానే. పోలిటిక్స్‌ ఇక్కడి జనానికి తెలిసినంతగా మరేవరికి తెలివయవంటే అతిశయోక్తి కాదు. ఈ జిల్లా నేతలు ప్రభుత్వ, ప్రతిపక్షాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఉంటారు.

అయితే అన్ని రంగాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సెంటిమెంట్లు ఉన్నాయి. ప్రత్యేకించి కృష్ణాజిల్లా రాజకీయ నేతల కోసం ఒక సెంటిమెంట్ ఉంది. ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వారు తర్వాతి ఎన్నికల్లో ఓటమిపోవడమే లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఖాయంగా జరుగుతోంది.

1985లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన వసంత నాగేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి‌లు 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ముక్కపాటి వెంకటేశ్వరరావు, కోనేరు రంగారావులు 1994 ఎన్నికల్లో ఓటమి చెందారు.

ఇక కృష్ణాజిల్లాలో టీడీపీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దేవినేని నెహ్రూ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 1994లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి నిర్వహించిన నెహ్రూ... టీడీపీలో చీలిక సమయంలో రామారావు పక్షాన నిలిచారు.

చంద్రబాబుతో విబేధించి కాంగ్రెస్‌లో చేరారు. 1999 ఎన్నికల్లో నెహ్రూ ఓటమి పాలయ్యారు. టీడీపీకే చెందిన దేవినేని వెంకటరమణ, వడ్డే శోభానాధ్రీశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రి పదవిని పొందారు.

అయితే వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించగా, 2004 ఎన్నికల్లో శోభనాధ్రీశ్వరరావు ఓడిపోయారు. ఇక 2004లో వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా స్వీకరించిన కొనేరు రంగారావు, పిన్నమనేని వెంకటేశ్వరావు, మండలి బుద్ధప్రసాద్‌లు 2009 ఎన్నికలలో ఓడిపోయారు.

2009లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణాజిల్లా నుంచి కొలుసు పార్థసారథికి మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే 2014లో వైసీపీ నుంచి బందరు పార్లమెంట్ ‌ఎన్నికల్లో బరిలోకి దిగిన పార్థసారథి ఓటమి పాలయ్యారు.

2014లో బీజేపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు రావడంతో కామినేని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

దీంతో మంత్రులుగా పనిచేసిన కృష్ణాజిల్లా నేతలు తదుపురి ఎన్నికల్లో ఓడిపోవడమో, రాజకీయంగా చిక్కుల్లో పడటమో తప్పదనే సెంటిమెంట్ క్రమంగా బలపడింది. ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణాజిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేస్తున్న దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలపై అందరి దృష్టి పడింది.

వచ్చే ఎన్నికల్లో వారి రాజకీయ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందోనని జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అందుకు తగినట్టుగా ఇద్దరు మంత్రులు వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీని ఎదుర్కొంటున్నారు.

మైలవరంలో దేవినేని ఎదుర్కోవడానికి పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ని జగన్ రంగంలోకి దించారు. అటు బందర్‌లో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా జనాల్లోకి దూసుకెళ్తూ రోజు రోజుకి బలపడుతూ రవీంద్రకు చెమటలు పట్టిస్తున్నారు.