విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు. విశాఖ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఉండాలనేది ఆయన ఆలోచన. ఐదేళ్ల క్రితం గత ఎన్నికల్లో మలుపు తిరిగినట్లుగానే ఈసారి కూడా మలుపు తిరుగుతుందనేది ఆయన భావిస్తున్నారు. 

ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 30వ తేదీన విశాఖలో నిర్వహించిన తెలుగుదేశం సభ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. అప్పటి వరకు వీస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు గాలి ఒక్కసారిగా ఆగిపోయి సైకిల్ పరుగులు పెట్టింది. అప్పుడు విశాఖ వన్ టౌన్ లోని ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఆ సభ జరిగింది. 

చంద్రబాబుతో పాటు అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ప్రజలు పోటెత్తారు. కాబోయే ప్రధానిగా నరేంద్ర మోడీని చంద్రబాబు అప్పుడు రాష్ట్ర ప్రజలకు చూపించారు. మోడీ ప్రధాని అయితే, రాష్ట్ర సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మబలికారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ వల్ల యువత, మేధావివర్గం, మధ్యతరగతికి చెందిన తటస్థులంతా టీడీపికి అనుకూలంగా మారారు. 

అయిదేళ్ల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే, విశాఖ సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతున్నారు. 

ఐదేళ్ల క్రితం మోడీని ప్రధానిగా చూపించినట్లుగానే మమతా బెనర్జీని చంద్రబాబు భావి ప్రధానిగా చూపించదలుచుకున్నారా అనేది ప్రశ్న. మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదని, ఢిల్లీలో చక్రం తిప్పేది తానేనని, తానే భావి ప్రధానిని నిర్ణయిస్తానని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అందుకు తగినట్లుగానే మమతా బెనర్జీని భావి ప్రధానిగా సంకేతిస్తారా అనేది చూడాల్సి ఉంది. 

అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై యువతకు ఉన్న ఆకర్షణ, ఆయన పట్ల మేధావి వర్గంలో, తటస్థుల్లో ఉన్న అభిమానం పనికి వస్తాయని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. తద్వారా ఐదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ పోషించిన పాత్రను కేజ్రీవాల్ తనకు అనుకూలంగా పోషిస్తారని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. పడిపోయిన టీడీపి గ్రాఫ్ ను ఐదేళ్ల క్రితం విశాఖ సభ పైకి లేపినట్లుగానే ఈసారి సభ కూడా లేపుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారని చెప్పవచ్చు.

ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 30వ తేదీన టీడీపి విశాఖ సభ జరిగింది. ఇప్పుడు మార్చి 31వ తేదీన జరగబోతోంది. అప్పుడు మే 7వ తేీదన పోలింగ్ జరగగా, ఆసారి ఏప్రిల్ 11వ తేదీన జరుగుతోంది. తేడా మాత్రం నరేంద్ర మోడీ స్థానంలో మమతా, పవన్ కల్యాణ్ స్థానంలో కేజ్రీవాల్ ఉండబోతున్నారు. అయితే, చంద్రబాబు సెంటిమెంట్ పనిచేసి ఫ్యాన్ గాలి తగ్గుతుందా, సైకిల్ జోరు పెరుగుతుందా అనేది చూడాల్సిందే.