సత్తెనపల్లి:  మన డబ్బులు కొట్టేసిన కేసీఆర్‌ ముందు నా తల దించుకొనే పరిస్థితిని తీసుకొస్తారా... తలఎత్తుకొనేలా చేస్తారో  మీ చేతుల్లోనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

మంగళవారం నాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.మన డబ్బులు కొట్టేసిన కేసీఆర్ 88 సీట్లలో గెలిస్తే... కేసీఆర్ కంటే  తక్కువ సీట్లలో గెలిస్తే తాను కేసీఆర్ తలదించుకోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని  బాబు చెప్పారు.

ఆంధ్రుల పౌరుషాన్ని చూపి 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.కేసీఆర్‌కు వారం రోజులుగా పొగ పెడితే నిన్న బయటపడ్డాడని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 

ప్రత్యేక హోదాకు తాను మద్దతిస్తున్నానని కేసీఆర్ ప్రకటించాడని... అయితే కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో ఎందుకు మద్దతివ్వలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ తనతో పెట్టుకొంటే తాట తీస్తానని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని ఆయన చెప్పారు.

500 మంది కేసీఆర్‌లు,  వెయ్యి మంది మోడీలు వచ్చినా కూడ తననేమీ చేయలేరని  చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. ఏపీ జోలికి రావాలంటే గజ గజ వణికిపోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటయోధుడిగా మీ తరపున పోరాటం చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. తనను ఆశీర్వదిస్తే ఏపీ ప్రజల హక్కుల కోసం సైనికుడి మాదిరిగా నిరంతరం పోరాటం చేస్తానని బాబు హామీ ఇచ్చారు.