విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా వెళ్తున్న విద్యార్థినిని గమనించి బడి వద్ద దింపుతానని తన బైక్ పై ఎక్కించుకుని మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి పంచాయతీ శివారు వెల్లంకి గ్రామ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం కుంపిల్లి గ్రామానికి చెందిన జి.కొండబాబు (40) చీడికాడ మండలం శిరిజాం పంచాయతీ శివారు లక్ష్మీనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు
 
దేవరాపల్లిలో నివాసం ఉంటూ రోజూ బైక్‌పై పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. మంగళవారం పాఠశాలకు బయలుదేరిన కొండబాబుకు కాలినడకన వెళుతున్న తురువోలు ఉన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థిని(14) కనిపించింది. ఆమె ముందు బండి ఆపి తాను టీచర్‌ను అని, స్కూల్‌ వద్ద దిగబెడతానని నమ్మించాడు. 

బైక్‌ ఎక్కించుకుని తురువోలు పాఠశాలకు రెండు కిలోమీటర్ల ముందున్న వెల్లంకి గ్రామం సమీపంలో గల ముత్యాలమ్మ గుడి వద్దకు తీసుకువెళ్లాడు. అమ్మవారికి దండం పెట్టుకుందామంటూ ఆమెను లోనికి తీసుకువెళ్లిన ఉపాధ్యాయుడు పక్కనే ఉన్న ఒక పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
 
విద్యార్థిని కేకలు వేయడంతో అదే మార్గంలో పాఠశాలకు వెళుతునన్న ఓ విద్యార్థి చూసి గ్రామస్థులను పిలుచుకువచ్చాడు. వారు ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు.విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడు కొండబాబును జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి సస్పెండ్‌ చేశారు.