ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతిన్నది. కేవలం రాజధానికే పరిమితం కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనపడుతోంది. దేశమంతా ఆర్ధిక మాంద్యం ఛాయలు కనపడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో సైతం అలాంటి పవనాలే వీస్తున్నాయి. కనుచూపుమేరలో ఎక్కడా నూతన పెట్టుబడులు కనపడడం లేదు. 

అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం. ఒక పక్క అప్పులు పెరిగిపోతున్నాయి. మరొపక్కనేమో ఆర్థికరంగం అనుకున్న విధంగా ముందుకెళ్ళడంలేదు. బయటనుండి పెట్టుబడులు రావడం కష్టమైనప్పుడు లోకల్ గానే నూతన ఆదాయ మార్గాలను అన్వేషించడానికి పూనుకుంది జగన్ సర్కార్. 

ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్టు, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మూడు రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఎన్నికల హామీ, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడం. ఈ మూడు రకాల ప్రయోజనాలను చేకూర్చనుంది ఈ నూతన నిర్ణయం. అదే నూతన జిల్లాల ఏర్పాటు. 

ఇలా నూతన జిల్లాలను ఏర్పాటుచేస్తే పైన పేర్కొన్న ఈ మూడు రకాల లాభాలు పొందవచ్చని భావిస్తోంది జగన్ సర్కార్. మొదటగా ఎన్నికల హామీ విషయాన్ని పరిశీలిద్దాం. ఎన్నికల ప్రచార సమయంలో ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తన ప్రచారంలో పదేపదే ప్రస్తావించిన విషయం మనందరికీ తెలిసిందే. తాను అధికారంలోకి రాగానే ఇలా నూతన జిల్లాల ఏర్పాటు చేస్తానని హామీని కూడ ఇచ్చాడు. ఇలా నూతన జిల్లాల ఏర్పాటు వల్ల ఎన్నికల హామీని నిరవేర్చినట్టు అవుతుంది. 

ఇక రెండో విషయానికి వస్తే ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం. ఇలా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే, జిల్లాల విస్తీర్ణత తగ్గుతుంది. తద్వారా పాలన అందించడం సుగమమవుతుంది. ఇలా చేయడం వల్ల వికేంద్రీకరణ కూడా జరుగుతుంది. ఈ తరహా వికేంద్రీకరణ కోసమే జగన్ నాలుగు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా వికేంద్రీకరణ వల్ల రాష్ట్రప్రజలకు ప్రమాణం చేసిన నవరత్నాలను వారికి  మరింత చేరువ చేసే ఆస్కారం కూడా జగన్ సర్కార్ కు లభిస్తుంది. . 

మూడవది అతి ముఖ్యమైనది. ఆర్ధిక రాబడి. ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం ఒక రకంగా పడకేసిందని చెప్పవచ్చు. రాజధాని నుంచి మొదలుకొని పట్టణాల వరకు ఎక్కడా రియల్ ఎస్టేట్ బూమ్ కనపడడం లేదు. ఇలా రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూండడంతో రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. దానితో వీటిపైన వచ్చే పన్ను తగ్గింది.  ముఖ్య ఆదాయ వనరుల్లో ఒకటైన  ఈ స్టాంప్ డ్యూటీ  భారీగా  తగ్గింది. 

ఇలా జిల్లాలను విస్తరిస్తే అక్కడ నూతన కార్యాలయాలు, భవనాలను ఏర్పాటు చేయవలిసి వస్తుంది. ఇలా ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలియగానే అక్కడ భూముల రేట్లకు రెక్కలొస్తాయి. ఈ విధంగా పడకేసిన రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించాలని జగన్ భావిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్లపైన పన్నుల రూపంలో భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. 

ఈ ఒక్క చర్యవల్ల అనేక లాభాలున్న నేపథ్యంలో అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టాడు జగన్. ఇప్పటికే అధికారులకు ఈ విషయంపైన సమగ్రమైన నివేదికను రూపొందించమని ఆదేశాలు అందాయి. జగన్ ఆదేశాలానుసారం ఈ అధికారులు పనిని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది . రాష్ట్ర  గవర్నర్ విశ్వభూషణ్ తో జరిగిన భేటీలో జగన్ ఈ విషయాన్ని గవర్నర్ కు సవివరంగా కూడా తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. 

తాజాగా భారీ స్థాయిలో ప్రభుత్వ నియామకాలను చేపట్టింది జగన్ సర్కార్. ఇలా జిల్లాలను విస్తరిస్తే అధికారులు ఎక్కువ సంఖ్యలో అవసరమవుతారు కాబట్టే ఈ భారీ నియామకాన్ని జగన్ సర్కార్ చేపట్టినట్టు అర్థమవుతుంది. 

ఇప్పుడు ఇలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎన్నో నూతన భవనాల నిర్మాణం చేయవలిసి ఉంటుంది. దీనికి ఖర్చు భారీ స్థాయిలోనే పెట్టాల్సివస్తుంది. ఇది  రాష్ట్ర బడ్జెట్ పైన పెను భారాన్ని కూడా  మోపుతోంది. 

కాకపోతే ఎప్పటికైనా జిల్లాల విస్తరణ జరగాల్సిందే. ఆలా చేయడం వల్ల లాభాలు కూడా అనేకం కనపడుతుండడంతో జగన్ సర్కార్ ఈ విషయంలో వేగం పెంచినట్టుగా మనకు కనపడుతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన ఈ నూతన జిల్లాల ప్రారంభోత్సవం జరగనున్నట్టు తెలుస్తోంది.