విజయవాడ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో తమ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరేది లేనిదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయిస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని చెప్పారు. కేంద్రంలో చేరాలా, వద్దా అనే విషయంలో జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ఏదైనా ఉంటే జగన్ ప్రకటిస్తారని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

జగన్ నుంచి ఏ విధమైన ప్రకటన రాలేదని, ఆ స్థితిలో కేంద్రంలో చేరే విషయంపై ఎవరేం చెప్పినా అది పార్టీ మాట కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే తాము బిజెపికి కేంద్రంలో సహకరిస్తామని వైఎస్ జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని వేరే విధంగా సహకరిస్తామని కేంద్రం చెబుతోందని ఆయన అన్నారు.

Also Read: ఎన్డీఏలోకి జగన్ : కేంద్రంలో వైసీపీకి దక్కే బెర్తులివే...? 

కేంద్రంలో బిజెపికి 333 సీట్లు వచ్చాయని, అందువల్ల బిజెపికి తమ అవసరం లేదని, అందువల్ల ప్రత్యేక హోదాపై డిమాండ్ చేయలేని పరిస్థితి ఉన్నా ఒక్కటికి రెండు సార్లు అడుగుదామని జగన్ అన్నట్లు ఆయన వివరించారు. రాజ్యసభలో బిజెపికి బలం లేదని, తమకు ఇద్దరు ఎంపీలున్నారని ఆయన చెప్పారు. 

ఏప్రిల్ నాటికి మరో నాలుగు రాజ్యసభ సీట్లు తమకు వస్తాయని, ఆ తర్వాతి ఏడాది మరో నాలుగు సీట్లు వస్తాయని, రాజ్యసభలో వైసీపీ అవసరం కేంద్రానికి ఉంటుందని, అటువంటి స్థితిలో ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాను తెచ్చుకుందామని జగన్ చెప్పినట్లు కూడా ఆయన వివరించారు. 

Also Read: జగన్ ఢిల్లీ యాత్ర.... ఎన్డీఏలో వైసీపీ నయా పాత్ర...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో వైసీపీ ఎన్డీఎలో చేరుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానిపై రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి.