తన సెక్స్ కోరిక తీర్చాలంటూ ఓ యువకుడు వివాహితను వేధించాడు. వద్దని వారించినందుకు ఆమె భర్తపై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ కస్సాపేటలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కస్సాపేటకు చెందిన నియాజ్ కి భార్య రేష్మ(22) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా... అదే గ్రామానికి చెందిన ఇన్ను(22) అనే యువకుడు గత కొంతకాలంగా తన సెక్స్ కోరిక తీర్చాలంటూ  వివాహిత రేష్మను వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేసింది.

దీంతో.. విషయం తెలుసుకున్న నియాజ్.. ఇన్నుని సున్నితంగా మందలించాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. కాగా.. రేష్మ భర్త తనను అలా మందలించడం నచ్చని ఇన్ను.. స్నేహితుల సహాయంతో నియాజ్ పై దాడి చేశాడు.  తనకు రాజకీయ నాయకుల అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయలేరని రేష్మతో చెప్పాడు. తన మాట వినకుంటే భర్తను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.

తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ రొంపిచెర్ల ఎస్‌ఐ ప్రసాద్‌ను ఆదేశించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.