స్నేహితుడి భార్య అంటే సోదరితో సమానం. అలాంటి ఆమెపైనే కన్నేశాడు ఓ వైసీపీ నేత. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్‌ నర్సింగ్‌ నాయక్‌ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పని చేశారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన యువకుడు నాయక్‌కు బాల్య స్నేహితుడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే స్నేహితుడి భార్య తాడేపల్లి మండలానికి చెందినది కావడంతో తన గ్రామంలో శుభకార్యానికి వెళ్లేందుకు భర్త స్నేహితుడైన నర్సింగ్‌ నాయక్‌తో కలిసి బయల్దేరింది. గత నెల 27న వీరు హిందూ కళాశాల వద్ద బస్సు దిగారు. హోటల్‌లో భోజనం చేసి వెళదామని నర్సింగ్‌ నాయక్‌ ఆమెను రైల్వే స్టేషన్‌ రోడ్డులోని లాడ్జికి తీసుకువెళ్లాడు. రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించి గది నుంచి పారిపోయింది.
 
ఇంటికి వెళ్లి జరిగిన విషయం భర్తకు చెప్పింది. భర్త సూచనతో ఈ నెల 1న బాధితురాలు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించ కుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ ఎస్సై బేరం కుదుర్చుకుంటున్నారంటూ పోలీస్‌ ఉన్నతాధి కారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ నాయక్‌ను గురువారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.