విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ ప్రయాణికురాలిని చీకట్లోకి లాక్కెళ్లి వివస్త్రను చేసి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘట మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 50ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. 

కొద్దిరోజుల క్రితం ఆమె వ్యాపారం కోసం విజయవాడకు వచ్చింది. తిరిగి ఉయ్యూరుకు వెళ్లడానికి రాత్రి పది గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లోని ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ఫాం చేరుకుంది. అక్కడ వేచి ఉండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమెను మాటల్లోకి దింపారు. అక్కడి నుంచి మెల్లగా ప్లాట్‌ఫాం చివరి వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. ఆమె వద్ద ఉన్న డబ్బు లాక్కుపోయారు.
 
బాధితురాలు నగ్నంగా రైల్వేట్రాక్‌ పరుగెత్తుకుంటూ  రావడాన్ని అక్కడున్నవారు గమనించారు. ఆమె ఒంటిపై వస్త్రాలను కప్పి, పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. 108 అంబులెన్స్‌లో బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఆమె తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉంది. తన పేరు, ఊరు పేరు తప్ప ఇతర వివరాలేమీ చెప్పలేకపోతోంది. కేసును జీఆర్పీ పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. మెడ, మర్మాంగంపై గాయాలున్నాయి. నెత్తురోడుతోంది.ఇది బ్లేడ్‌ బ్యాచ్‌ పని కావచ్చునని అనుమానిస్తున్నారు..