అక్రమ సంబంధాలు జీవితాలు నాశనం చేస్తున్నాయి. ఓ సంబంధం కోసం మరొకరిని అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. మొత్తంగా కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి వార్తలు తరచూ వస్తూనే ఉన్నా.. ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలా మంది ఆ సంబంధాల కోసం వెంపర్లాడుతూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా.. ఇలాంటి సంఘటన ఒకటి గుంటూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తి కొండలో ఓ వ్యక్తి సారా అమ్మేవాడు. కాగా.. ఆ సారా అమ్మే వ్యక్తి వద్దకు పూర్ణ చంద్రరావు(39) తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో.. సారా అమ్మే వ్యక్తి భార్య తో పూర్ణ చంద్రరావుకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

కాగా.. ఈ క్రమంలో సదరు మహిళ తన భర్తను వదిలేసి పూర్ణ చంద్రరావుతో సంబంధం కొనసాగించింది. ఆ తర్వాత సదరు మహిళ 2011లో వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. పూర్ణ చంద్రరావుకి కూడా వేరే మహిళతో వివాహమైంది. అయినప్పటికీ.. వీరు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగుతూ వచ్చేవారు.

అయితే.. ఈ విషయం ఇటీవల సదరు మహిళ రెండో భర్తకు తెలిసిపోయింది. దీంతో.. కోపంతో రగిలిపోయిన అతను.. పూర్ణ చంద్రరావుని చంపేయడానికి ప్లాన్ వేశాడు. పూర్ణ చంద్రరావుని అడ్డు తొలగించుకోకపోతే.. తన రెండో భర్త తనను వదిలేస్తాడేమో అనే భయం ఆమెలోనూ మొదలైంది.

దీంతో.. ప్రియుడిని చంపడానికి ఒప్పుకుంది. పథకం ప్రకారం పూర్ణ చంద్రరావుని పిలిచి చున్నీ మెడకు బిగించి హత్య చేసింది. అనంతరం ఈ హత్య కేసును తన రెండో భర్త మీద వేయాలని ప్లాన్ వేసింది. అయితే.. అది బెడసి కొట్టడంతో.. ఆమె పోలీసులకు చిక్కింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.