ఆంధ్రప్రదేశ్‌లో మృగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు నాలుగు చోట్ల అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఒక మహిళా వీఆర్ఏ కూడా ఉన్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం అప్పరాజుపేటలో నివాసం ఉంటున్న యర్రబల్లి వీఆర్ఏ పోలు ఓబులమ్మపై గురువారం గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం హత్యకు పాల్పడ్డారు.

ఆపై చెవి కమ్మలు, ముక్కు పుడక, రూ.20 వేలు దోచుకెళ్లారు. హతురాలు ఓబులమ్మ భర్త తంబళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి వీఆర్ఏగా పనిచేస్తూ మరణించడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం బద్వేలుకు వెళ్లి బ్యాంక్ నుంచి రూ.20 వేలు నగదు డ్రా చేసి ఓబులమ్మ 11 గంటల సమయంలో పత్తి పంటకు నీటిని పెట్టేందుకు వెళ్లింది... సాయంత్రం కావొస్తున్న తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారుడు పొలంలోకి వెళ్లి చూశాడు.

మోటారు పనిచేస్తూనే ఉన్నప్పటికీ తల్లి కనిపించకపోవడంతో తోట మొత్తం వెతకగా ఒంటి మీద బట్టలు లేకుండా ఓబులమ్మ రక్తపు గాయాలతో చనిపోయి ఉంది. ఈ దృశ్యం చూసి కన్నీటిపర్యంతమైన అతను పోలీసులకు సమాచారం అందించాడు.

ఇక మరో ఘటనలో అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లికి చెందిన కరియన్న అలియాస్ కిరణ్ పొరిగింట్లో ఉంటున్న ఐదేళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పొద్దుపోయాక ఇంటికొచ్చిన తల్లిదండ్రులు తమ కూతురి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా...అక్కడ పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు చెప్పారు.

ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కన్నేశాడు.

పాఠశాలలో ఉన్న యువతిని సుబ్బు అనే యువకుడు కలిసి.. ‘‘ మీ తల్లిదండ్రులు పొలంలో ఉన్నారని.. వారి వద్దకు తీసుకెళ్తానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని దగ్గర్లోని అడవిలో అత్యాచారం చేశాడు.

అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువతిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో ఘటనలో ఇదే జిల్లాలోని అంబాజీపేట మండలం గంగలకుర్ర అగ్రహారం రాచపాలెంకు చెందిన ఒక యువతిపై అల్లవరానికి చెందిన కడలి శివ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తాతయ్యకు చెప్పడంతో అంబాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.