విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. జనసేన ర్యాలీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. బుధవారం పవన్ కల్యాణ్ ముంపునకు గురైన వరిపొలాలను పరిశీలించడానికి వచ్చారు. 

పవన్ కల్యాణ్ ర్యాలీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పామర్రు మండలం కురుమద్దాలి పెట్రోలు బంకు సమీపానికి వచ్చేసిరికి విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ర్యాలీలోని రెండు టూవీలర్స్ ను మరో వాహనం ఢీకొట్టింది. 

ఆ సంఘటనలో పెనమలూరు ప్రాంతానికి చెందిన అబ్దుల్ సుక్ నబీ, పామర్రు మండలం జమీదుగ్గమిల్లికి చెందిన కేత పవన్ జేత, తోట నరేంద్ర, పామర్రు శివారు శ్యామలపురం వాసి గుమ్మడి వంశీలు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విజయవాడ ఆస్పత్రికి, మరో ఇద్దరిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.  

బూతులు తిట్టుకుంటూ....

అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప రైతులను ఆదుకోవడంపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ మండలాలతో పాటు గుంటూరు జిల్ాల రేపల్లె, భట్టిప్రోలు, తెనాలి మండలాల్లో ఆయన పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. 

నష్టపరిహారం అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ విమర్శించారు. తెలంగాణలో వరదలు వస్తే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.6,500 కోట్లు అందించిందని, మన రాష్ట్రంలో నేటికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదని, దీన్ని బట్టి ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.