నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక ప్రేమజంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది.

ఈ ఘటన ఇంకా మరచిపోకముందే గుంటూరు జిల్లా మంగళగిరిలో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి సమీపంలోని నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో ప్రేమ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

వివరాల్లోకి వెళితే... తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాస్, అంగడి జ్యోతి అనే యువతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కలిసి సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు.

నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న వీరిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో జ్యోతికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించగా.. శ్రీనివాస్ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.