గుంటూరు: గుంటూరు జిల్లాలో  వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని కారుపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేరు.కోటప్పకొండలో ప్రభలను వైసీపీకి చెందిన కార్యకర్తలకు అప్పగించి ఎమ్మెల్యే భర్త, ఆమె మరిది ఇతరులు కారులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకొంది.

ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు కట్టుబడివారిపాలెం చేరుకొన్న సమయంలో దుండగులు అటకాయించి దాడికి పాల్పడ్డారు. కారులో ఎమ్మెల్యే ఉందని భావించి ఈ దాడి చేసినట్టుగా ఎమ్మెల్యే మరిది చెబుతున్నారు. కారులో ఎమ్మెల్యే ఉంటే దాడిని మరింత ఎక్కువగా చేసేవాళ్లమని దుండగులు బెదిరించారని ఆయన చెప్పారు.

టీడీపీకి చెందిన వారే తమ కారుపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే రజని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.