రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అరెస్టే చేసే ధైర్యం కేంద్రం చేయదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ కు ఆయన బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు అఖండమైన ప్రజా బలం ఉంది కాబట్టి అరెస్టు చేసే ధైర్యం కేంద్రం చేయదని ఆయన అన్నారు. 

తమిళనాడులో శశికళను అరెస్టు చేసినట్లుగా ఏపీలో జగన్ ను అరెస్టు చేయలేరని, శశికళ గ్రాఫ్ ఆ సమయంలో పతనావస్థలో ఉందని, ప్రజాబలం విషయంలో జగన్ ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నారని, ఆయనకు 65 శాతం మంది ప్రజల మద్దతు ఉందని, అందువల్ల జగన్ ను కేంద్రం టచ్ చేయదని ఉండవల్లి వివరించారు. 

ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసినప్పుడు టీడీపీ పత్రికలు రాసినట్లుగా కేసుల గురించే మాట్లాడితే జగన్ బలహీనపడుతారని, తాను లేఖలో రాసినట్లు రాష్ట్రానికి కావాల్సినవి రప్పించుకుంటే బలపడుతాడని ఆయన అన్నారు కేసుల గురించి జగన్ మాట్లాడితే మాట్లాడవచ్చు గానీ ఐదు నిమిషాలు దానికి ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ఎక్కువ సమయం ఇస్తే బలపడుతారని ఆయన అన్నారు. 

Also Read: ఇక జగన్ ను దేవుడే ఆశీర్వదించాలి: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

మీరేమైనా చేసుకోండి, నా బెయిల్ ను రద్దు చేసుకుంటే చేసుకోండి, ఇప్పటికే 16 నెలలు జైలులో ఉన్నాను, మీరు ప్రధానిగా ఉన్నంత కాలం జైలులో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని జగన్ గట్టిగా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. తెగబడితే జగన్ ను అరెస్టు చేసే దమ్ము కేంద్రానికి లేదని, జగన్ కు అంతటి ప్రజాబలం ఉందని ఉండవల్లి అన్నారు.