కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల వయస్సు గల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్వాలకుర్తి గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలిక నోట్లో గడ్డి మందు పోసి దుండగులు పరారయ్యారు. బాధితురాలు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఓ బాలిక బనవాసి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 

పాఠశాలకు సెలవు కావడంతో అమ్మాయి ఇంటి వద్దనే ఉంటోంది. తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వేరుశనగ పంటను తెంచేందుకు పొలానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దాన్ని గమనించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 

ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు అది చూసి గట్టిగా అరిచాడు. దాంతో దుండగులు బాలిక నోట్లో గడ్డి మందు పోసి పరారయ్యారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత అపస్మారక స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి వెంటనే కోడమూరు ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.