కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ఓ దొంగ ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశఆడు. ఈ ఘటనలో 29 ఏళ్ల ప్రభు అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. 

తూర్పు గోదావరి జిల్లాలో నవంబర్ 25వ తేదీ తెల్లవారు జామున ప్రభు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. దొంగతనం చేయడానికి ప్రభు ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రపోతున్న ఐదేళ్ల వయస్సు గల బాలికను ఎత్తుకెళ్లాడు. 

ఇంటికి సమీపంలోని ఓ స్మశానవాటికకు బాలికను తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. బాలిక దేహంపై తీవ్రమైన గాయాలు అయ్యాయి.

ఆ రోజు తెల్లవారు జామున నానమ్మ నిద్ర లేచి చూసేసరికి పక్కలో పాప కనిపించలేదు. తన భర్తకు, అల్లుడికి విషయం చెప్పింది. అది తెలిసి వారు పాప కోసం గాలింపు జరిపారు.చివరకు పాప స్మశానవాటికలో కనిపించింది. 

బాలిక రక్తమోడుతూ కనిపించింది. ఆదే సమయంలో నానమ్మ మొబైల్ కూడా కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పాప చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కానీ అతడు నిందితుడు కాదని తేలింది. దాంతో అతన్ని వదిలేశారు.

అదృశ్యమైన మొబైల్ ఫోన్ ను పోలీసులు ట్రాక్ చేసారు. ఇంట్లోని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పాత నేరస్థుడు ప్రభు ఆ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. 

విచారణలో ప్రభు నేరాన్ని అంగీకరించాడు. అతను చోరీలు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. అతనిపై 16 చోరీ కేసులు, ఓ దోపిడీ కేసు ఉన్నాయి.