Andhra Pradesh Assembly Elections 2024 : తెలుగుదేశం పార్టీ బలాలు, బలహీనతలు, అసంతృప్తులు... 

ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అధికారాన్ని చేపట్టిన ఏకైకపార్టీ తెలుగుదేశం.  అలాంటి  పార్టీకి గత ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. అయితే మరోసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఈ సందర్భంగా ఓసారి టిడిపి బలాలు, బలహీనతలతో పాటు ఎన్నికల వేళ అసంతృప్తుల గురించి ఓసారి తెలుసుకుందాం. 

Telugu Desam Party Strengths and Weaknesses AKP

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి  మామూలుగా లేదు. మిగతా రాష్ట్రాల్లో అంటే కేవలం లోక్ సభ ఎన్నికలే కాబట్టి అంతా ఈజీగా సాగుతోంది కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అలాకాదు... లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి కాబట్టి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎప్పటినుండో ఎలక్షన్ హీట్ మొదలయినా ఇటీవల ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇది తారాస్థాయికి చేరుకుంది.  నాలుగో విడతలో అంటే మే 13న ఏపీలోని 175 అసెంబ్లీలు, 25 ఎంపీ స్థానాల్లో పొలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రాజకీయా పార్టీల బలాలు, బలహీనతలు, ఎన్నికల వేళ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి తెలుసుకుందాం. 

ముందుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఓవైపు బలంగాను... మరోవైపు బలహీనంగాను కనిపిస్తోంది. జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ముందుకు వెళ్ళడం టిడిపి బలమే... కానీ ఇదే కొన్ని సమస్యను సృష్టించి ఆ పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక రాజకీయ, కుల సమీకరణలతో పాటు కొన్ని సీట్ల కోసం ఎక్కువమంది పోటీపడుతుండటంతో అంసతృప్తి భగ్గుమంటోంది.  ఇలా బలం వున్నచోట బలహీనతలు కూడా వుంటున్నాయి. 


ఈ ఎన్నికల్లో టిడిపి బలాలు : 

1.  జననసేనతో పొత్తు : తెలుగుదేశం, జనసేన గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేయడంవల్లే గత ఎన్నికల్లో వైసిపి ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ అదే తప్పుచేయకుండా జనసేనను కలుపుకునిపోతూ టిడిపి మరింత బలంగా మారింది. ముఖ్యంగా పవన్ తో దోస్తీ ఇరు గోదావరి జిల్లాలో టిడిపికి సాలిడ్ గా కలిసివస్తుందన్నది ఇరుపార్టీల అభిప్రాయం.

2. నారా లోకేష్ : నిజంగా ఈసారి చంద్రబాబు ఒక్కరే కాదు లోకేష్ కు కూడా టిడిపికి బలంగా మారారు. యువగర్జన పాదయాత్ర, సభలు సమావేశాల్లో ఆయన మాటతీరు టిడిపి శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నాయి. తన మాటలతో గతంలో తనపై పడ్డ పప్పు ముద్రను  తొలగించుకున్నారు.     

3.  ప్రభుత్వ వ్యతిరేకత : రాష్ట్ర ప్రజల్లో వైసిపి ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత ఆటోమేటిక్ గా టిడిపికి బలమే. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన, బిజెపిలతో పొత్తు వుండనేవుంది. 

4. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం ఈ ఎన్నికల్లో టిడిపికి కలిసివచ్చే అవకాశముంది. ఈ వయసులో చంద్రబాబు అరెస్ట్ ఐటీతో పాటు ఇతర ఉద్యోగవర్గాలు, సామాన్య ప్రజలను ఆవేదనకు గురిచేసిందనే చెప్పాలి. ఆ సింపథీ ఈ ఎన్నికల్లో పనిచేయవచ్చు.

5. టిడిపి కార్యకర్తలు : ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ఐదేళ్ల వైసిపి పాలనలో నలిగిపోయారు. కాబట్టి ఈసారి ఎలాగైనా తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్న పట్టుదలతో వున్నారు.    

6. రాజధాని అమరావతి వివాదం : రాష్ట్ర రాజధానికి అమరావతి నుండి తరలించాలన్న వైఎస్ జగన్ నిర్ణయం ఈసారి టిడిపికి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. అమరావతి రైతులు, మహిళల పోరాటాన్ని వైఎస్ జగన్ పట్టించుకోకపోవడంతో ఈసారి ఆ ప్రాంతప్రజలు టిడిపి పక్షాన నిలిచేలా కనిపిస్తున్నారు. 

టిడిపి బలహీనతలు :  

1.  చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరిట రైతుల నుండి భూములు తీసుకుని చంద్రబాబు, ఆయన సన్నిహితులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టవగా అలాంటి మరికొన్ని కేసులు ఆయనపై వున్నాయి. ఆయన తనయుడు నారా లోకేష్ పై కూడా అవినీతి కేసులు వున్నాయి. వైసిపి ప్రభుత్వం కక్ష్యపూరితంగానే ఈ కేసులు పెట్టిందని టిడిపి చెబుతున్నా ఆల్రెడీ చంద్రబాబుపై అవినీతి మరకపడిపోయింది.  ఇది ఈ ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చు. 

2. బిజెపితో పొత్తుతో పోల్ మేనేజ్ మెంట్ చేసినా మైనారిటీ ఓట్లకు టిడిపి దూరమయ్యంది ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం ఓటర్లు టిడిపి నుండి వైసిపి షిప్ట్ అయ్యే అవకాశాలున్నాయి. 

3. చంద్రబాబు క్లాస్ గుర్తింపు : విద్యావంతులు, ఉద్యోగులు అంటే కొద్దిగా క్లాస్   పీపుల్ చంద్రబాబును ఇష్టపడతారు. మాస్ ప్రజలు మాత్రం చంద్రబాబు హయాంలో టిడిపికి దూరమయ్యారనే ప్రచారం వుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల ఎఫెక్ట్ తో మహిళలు వైసిపికి చాలా దగ్గరయ్యారు. వీరికి దూరమవడం టిడిపి బలహీనతే అని చెప్పాలి. 

4.  నాయకుల అసంతృప్తి :  జనసేన, బిజెపిలతో పొత్తులో భాగంగా కొన్ని సీట్లను వారికి కేటాయించాల్సి వచ్చింది. కానీ ఆ సీట్లపై ఆశతో వున్న నాయకులు టిడిపిపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కొన్ని నియోజకర్గాల్లో ముందునుండి చెలరేగిన సీట్ల పంచాయితీ పార్టీలో గందరగోళం సృష్టించింది.  

టిడిపి అసంతృప్తులు :  

విజయవాడ పార్లమెంట్ : రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో విజయవాడ ఒకటి. గత ఎన్నికల్లో వైసిపి గాలి ఎంత బలంగా వీచినా విజయవాడ లోక్ సభను మాత్రం టిడిపియే గెల్చుకుంది. కానీ సరిగ్గా ఈ ఎన్నికలకు ముందు ఆ ఎంపీ కేశినేని నాని వైసిపిలో చేరిపోయారు. ఈసారి విజయవాడ సీటు తనకు దక్కదనే సంకేతాలు అందడంతో అసంతృప్తికి గురయిన ఆయన వైసిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారాడు. 

మైలవరం అసెంబ్లీ : మైలవరం నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కనబెట్టి వైసిపి నుండి చేర్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం సీటు ఇచ్చారు. ఆయనకు పెనమలూరు టికెట్ ఇస్తామని అక్కడా మరొకరికి అవకాశం ఇచ్చారు. దీంతో దేవినేని తీవ్ర అసంతృప్తితో వున్నారు. 

విజయవాడ పశ్చిమ : విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆయన విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా అదికాస్త బిజెపికి వెళ్ళిపోయింది. దీంతో ఆయన  అసంతృప్తికి గురయ్యారు. 

అనపర్తి : ఇక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చాలా సీరియస్ గా వున్నారు. ముందు తనకు సీటు కేటాయించి ఆ తర్వాత పొత్తులో భాగంగా  దాన్ని బిజెపికి ఇచ్చారు. దీంతో ఆయన మద్దతుదారులు టిడిపి జెండాలు, కండువాలు, ప్రచార సామాగ్రిని కాల్చి నిరసన తెలియజేసారు. రామకృష్ణారెడ్డి కూడా బిజెపి అభ్యర్ధికి సహకరించబోనని... తాను పోటీలో వుంటానంటున్నారు.  

అనంతపురం అసెంబ్లీ : అనంతపురంలో టిడిపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది.  అర్బన్ సీటు దగ్గుపాటి వెంకటప్రసాద్ కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి గురయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం ఏకంగా  పార్టీ జిల్లా కార్యాలయంపై దాడిచేసి ప్రచారసామాగ్రిని దగ్దం చేసారు. 

గుంతకల్లు : వైసిపి నుండి ఇటీవలే టిడిపిలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు టిడిపి గుంతకల్లు టికెట్ ఇచ్చింది. దీంతో ఇంతకాలం ఈ సీటుపై ఆశతోవున్న జింతేందర్ గౌడ్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు.  ఆయన అనుచరులు గుంతకల్లు టిడిపి కార్యాలయంపై దాడిచేసారు. 

రాజంపేట : ఈ సీటును సుగవాసి సుబ్రహ్మణ్యం కు కేటాయించడంతో నియోజకవర్గ ఇంచార్జీ  బత్యాల చెంగలరాయుడు అసంతృన్తికి గురయ్యారు. ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేసారు. 

చీపురుపల్లి : చీపురుపల్లిలో కూడా అలాంటి పరిస్థితే వుంది.  అక్కడ ఇంచార్జీగా వున్న కిమిడి నాగార్జునకు కాకుండా సీనియర్ నాయకులు కళా వెంకట్రావుకు టిడిపి సీటు కేటాయించింది. దీంతో  నాగార్జున అసంతృప్తికి గురయ్యారు. 

నూజివీడు : వైసిపి నుండి  చేరగానే నూజివీడు సీటు కొలుసు పార్థసారధికి దక్కింది. దీంతో ఎప్పటినుండో నూజివీడు ఇంచార్జీగా వున్న ముద్రబోయి వెంకటేశ్వరరావు  అసంతృప్తికి గురయ్యారు. 

తిరుపతి :  ఈ సీటును జనసేనకు కేటాయించడంతో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చి కంటతడికూడా పెట్టుకున్నారు. 
ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి అసంతృప్త నేతలు అనేకమంది వున్నారు. వారిని సముదాయించి దారికి తెచ్చుకోకుంటే ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios