భీమవరం: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ  పార్లమెంటు సభ్యుడదు యర్రా నారాయణస్వామి కుటుంబం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. యర్రా నారాయణ స్వామి తనయుడు కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా నవీన్‌ గురువారం ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో యర్రా అభిమానులతో ఓ సమావేశం నిర్వహించారు. 

తెలుగుదేశం పార్టీని వీడాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తమకు టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో యర్రా నారాయణస్వామి, నవీన్‌ పార్టీ మారనున్నారనే ప్రచారం గత కొన్నిరోజులుగా సాగుతోంది. ఈ క్రమంలోనే అభిమానులతో యర్రా నవీన్ సమావేశం ఏర్పాటు చేశారు.

పార్టీకి ఎంతో సేవచేసిన నారాయణస్వామికి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడంలేదని అనుచరులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. గుర్తింపు లేని పార్టీలో కొనసాగే కన్నా పార్టీని వీడడమే మేలని అభిమానులు చెప్పారని అంటున్నారు. 

దాంతో నవీన్‌ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని ప్రకటించినట్లు తెలిసింది. సమావేశంలో పాతపాటి సర్రాజు, మంతెన యోగీంద్రకుమార్‌(బాబు), రెడ్డిపల్లి సత్యనారాయణ, పీవీ గోపాలకృష్ణంరాజు పాల్గొన్నారు.