Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు షాక్: టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ రాజీనామా

ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో చర్చకు వచ్చిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.

TDP MLC Manikya Vara Prasad resigned
Author
Amaravati, First Published Jan 21, 2020, 11:43 AM IST

అమరావతి: ఎమ్మెల్సీ పదవికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన మంగళవారం శాసన మండలికి గైర్హాజరయ్యారు. ఆయన రాజీనామా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. తనను ఇన్నేళ్లు ప్రోత్సహించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన పత్తిపాడు నుంచి పోటీ చేశారు. 

పాలనా వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో చర్చకు వచ్చిన నేపథ్యంలో మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మండలి రాలేదు. ఆమె రాయలసీమకు చెందినవారు కావడం విశేషం.

బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ కూడా శాసన మండలికి రాలేదు. మాధవ్ విశాఖపట్నానికి చెందినవారు. రాయలసీమలోని కర్నూలుకు న్యాయ రాజధాని, విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని వస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతుగానే వారు సభకు రాలేదని భావిస్తున్నారు.

రత్నబాబు కూడా సభకు రాలేదు. సమావేశానికి ముందు వైసీపీ నాయకులు తమ సభ్యులతో మాట్లాడారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే, అనారోగ్యం కారణంగా శమంతకమణి సభకు రాలేదని చెబుతున్నారు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో కాళ్ల నొప్పుల వల్ల మూడో ఫ్లోర్ కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె సభకు రాలేదని చెబుతున్నారు.

సమావేశనికి ముందు చంద్రబాబు టిడిపి ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు బిల్లులను తిరస్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీకి బిల్లు పంపకుండా మండలిలోనే కాలయాపన చేసే వ్యూహాన్ని టిడీపీ అనుసరిస్తోంది. ఇదిలావుంటే, వైసీపీ ఎమ్మెల్సీలకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విప్ జారీ చేశారు.

మండలిలో మొత్తం సభ్యులు 58

టిడిపి 28, పిడిఎఫ్ 05, వైసీపీ 09, ఇండిపెండెంట్ 03, నామినేటెడ్ 08, బిజెపి 02, ఖాళీ 03

 

Follow Us:
Download App:
  • android
  • ios