అమరావతి: ముఖ్యమంత్రి జగన్ తన స్వార్ద్యంతో  రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి 3 ప్రాంతాల్లోని సహజవనరులను దోచుకునేందుకు కుట్ర పన్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అందుకోసం వైసీపీ ప్రజాప్రతినిధులను పావుగా వాడుకుంటున్నారని అన్నారు. జగన్ రాజధానిని  మార్చి రాష్ర్ట ప్రజలనే కాదు, వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్ ను కూడా ప్రశ్నార్ధకంగా మార్చారన్నారు. 

''గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులు అమరావతికి మద్దతుగా నిలబడి తమ పదవులకు రాజీనామా చేసి రాష్ర్ట ప్రయోజనాల కోసం రైతుల తరపున పోరాటం చేయాలి. అలా కాకుండా తమకు ప్రజల కన్నా పదవులే ముఖ్యం అనుకుంటే వారి రాజకీయ భవిష్యత్ కి సమాధి తప్పదు. తమ ఆశల్ని, ఆకాంక్షాలని నెరవేరుస్తారని మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నారు.  ప్రజల ఆకాంక్షలను గౌరవించనపుడు మీకు వారిచ్చిన పదవులెందుకు?'' అని మండిపడ్డారు. 

''అమరావతి ముక్కలు చేయడం భార్య,భర్త, పిల్లలను వేరు చేయడమే. రాజధాని అమరావతిలోనే ఉంటుందని మీరు ఎన్నికలకు ముందు మాట్లాడలేదా? జగన్ ఇప్పుడు రాజధానిని మారుస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?  మీకు ఏ మాత్రం  సామాజిక భాద్యత ఉన్నా వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిన ప్రజలు క్షమించరు'' అని హెచ్చరించారు. 

READ MORE   అమరావతి: జగన్, చంద్రబాబు మధ్య పోరుగా మార్చేసిన పవన్ కల్యాణ్

''గతంలో జగన్ ని నమ్మి ఎంతమంది రాజకీయ నాయకులు, అధికారులు జైలుపాలయ్యారో చూశారు. ఇప్పుడు మళ్లీ జగన్ ని నమ్మి రాజకీయ సన్యాసులు ఎందుకు అవుతారు?
 రైతుల వైపా? రైతు దగాకోరు వైపా? ఎటువైపు ఉంటారో వైసీపీ ప్రజాప్రతినిధులు తేల్చుకోవాలి'' అని సూచించారు. 

''రాష్ట్ర ప్రయోజనాలకోసం రైతులు వైపు నిలబడతారా? లేక పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసినవారిగా చరిత్రలో నిలుస్తారో తేల్చుకోవాలి. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ 3 రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించటంలేదు.  కానీ జగన్ తానా అంటే వైసీపీ నేతలు తందానా అంటూ  రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు.  నమ్మక ద్రోహులను, నయవంచకులును రాష్ర్ట  ప్రజలు క్షమింపరన్న విషయం వారు గుర్తుంచుకోవాలి'' అని సత్యప్రసాద్ హెచ్చరించారు.