విజయనగరం: కొన్ని సామాజిక వర్గాల్లో ఓట్లు అమ్ముడు పోయినా క్షత్రియుల్లో ఆ సంస్కృతి లేదన్నారు మాజీ కేంద్రమంత్రి  అశోక్ గజపతిరాజు.  మనం గౌరవం పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా మన వద్దకే వస్తుందని సూచించారు. 

రాష్ట్ర స్థాయి క్షత్రియ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఎవరినైనా తిడతారు... కానీ వారిని మాత్రం ఎవరూ ఏమనకూడదని అనుకుంటారన్నారు. ఎస్ఈసీ రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాస్తే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం ఏంటని అన్నారు. 

''ఈ ప్రభుత్వం నాపై ఎందుకనో వ్యక్తిగత ద్వేషం పెంచుకొంది. ఈ క్రమంలోనే నాపై వారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షత్రియ సమాజం ఆందోళనలు చేయడం ముదావహం. కానీ దాని వెనకే పడితే అసలు విషయం పక్కదారి పడుతుంది. ప్రస్తుతం హిందూ మతం పై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకుందాం...అదే మనల్ని కాపాడుతుంది'' అన్నారు. 

read more  నాయకులు, దేవాలయాలపై వరుస దాడులు... కేంద్ర హోంమంత్రికి టిడిపి ఎంపీల ఫిర్యాదు

''విజయనగరంలో అశోక్ చక్ర వంటి పతకాలను పొందిన వీరులున్నారు. కానీ అదే గడ్డ పై కొంతమంది నేతలు ప్రవర్తన తల దించుకునేలా ఉంది. కోడి పందాల వంటి జూదం నుంచి క్షత్రియలు బయట పడాల్సిన అవసరం ఉంది. మనకి అలాంటి అప్రతిష్ట వద్దు'' అని సూచించారు.

''బెయిల్ పై వచ్చిన వ్యక్తికి సింహాచలం భూముల బాధ్యతను అప్పగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే దారుణంగా ఈ ప్రభుత్వం భూములను లాకుంటోంది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూముల సంరక్షణను జాయింట్ కలెక్టర్ లకు అప్పగించడం దారుణం'' అని అశోక గజపతిరాజు మండిపడ్డారు.