రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిముషి బాజ్ పాయి చెప్పారు. మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బాలికకు వరుసకు అక్క అయ్యే మచ్చా అనిత దుర్మార్గానికి కారణం. బాలిక తల్లి అభ్యర్థన మేరకు రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో బాలికను అనిత పనికి పెట్టింది. గత నెల 22వ తేదీన అనిత మరో ఐదుగురు యువకులతో కుట్ర చేసింది. దుకాణానికని చెప్పి బాలికను ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లింది. 

చివరకు బాలికను రంపచోడవరం తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. వారి బెదరింపులకు భయపడి బాధితురాలు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత బాలిక అనారోగ్యానికి గురైంది. దాంతో తల్లి ఆమెను బయటకు రానివ్వలేదు. ఈ నెల 12వ తేదీన అనిత, మరికొంత మంది బాలిక ఇంటికి వెళ్లి బెదిరించి బెదిరించి ఆటోలో తీసుకుని వెళ్లారు. బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఆ తర్వాత బాలికను బంధించి చిత్రహింసలు పెట్టారు. కూతురు ఇంటికి రాకపోవడంతో బాలికక ల్లి కోరుకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియడంతో నిందితులు బాలికను వదిలేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను రాజమహేంద్రవరం ప్రబుత్వాస్పత్రికి తరలించారు.

తనపై అత్యాచారం చేసినట్లు బాలిక వాంగ్మూలం ఇచ్చింది. నిందితులు మచ్చా అనిత, ముప్పా శివ, సాయి, దువ్వాడ శివకుమార్, విజయకుమార్, రాజాలా వెంకటదుర్గ, కొత్తపల్లి గౌరీశంకర్, ఉండ్రాజపురం రవితేజ, కె. సత్యశివ వరప్రసాద్, డాని, చిన్ని, కసిరెడ్డి లావణ్యలను పోలీసులు అరెస్టు చేశారు.