ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎవరు?: ఐదుగురి పేర్లతో ప్రభుత్వానికి రిపోర్ట్

Selection committe submits report for  DGP post
Highlights

ఏపీ కొత్త డీజీపీ  నియామకంపై  బాబు కసరత్తు

అమరావతి: ఏపీ రాష్ట్ర కొత్త డీజీపీ నియామకం కోసం నియమించిన సెలక్షన్ కమిటీ ఐదుగురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఐదుగురు అధికారుల పేర్లు, సర్వీసు రికార్డులను కమిటీ అందించింది. కొత్త డీజీపీ నియామకంపై  శనివారం నాడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 30వ తేదితో  ప్రస్తుత డీజీపీగా ఉన్న మాలకొండయ్య రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యంగా మారింది.

కొత్త డీజీపీ ఎంపిక కోసం  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  ఐదుగురు  ఐపీఎస్ అధికారుల పేర్లను   శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

వాస్తవానికి డీజీపీ ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్ల ఆధారంగా యూపీఎస్సీ రికమండేషన్ చేసేది. అయితే గత ఏడాది డిసెంబర్ మాసంలో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  డీజీపీ ఎంపిక కోసం చట్టాన్ని మార్చుకొంది. దీంతో డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఐపీఎస్ అధికారులకు ట్రాక్ రికార్డు, సర్వీసు వివరాల ఆధారంగా  నివేదికను రూపొందించింది.

గౌతం సవాంగ్,  ఆర్పీ ఠాగూర్, కౌముది,  సురేంద్రబాబు, అనురాధల పేర్లను సెలక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఐదుగురు ఐపీఎస్ అధికారుల ట్రాక్ రికార్డుతో పాటు సర్వీసు  వివరాలను కూడ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం  శనివారం నాడు డీజీపీ ఎంపిక విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

విజయవాడ సీపీ గా ఉన్న గౌతం సవాంగ్ పేరు డీజీపీ నియామకం కోసం ప్రధానంగా విన్పిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది తెలియాల్సి ఉంది.


 

loader