ఆంధ్ర ప్రదేశ్ డిజిపిగా ఆర్పీ ఠాకూర్ నియామకం

rp thakur appointed as ap dgp
Highlights

చివరివరకు రేసులో నిలిచిన గౌతమ్ సవాంగ్...

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ బాస్ గా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఆయన్ని రాష్ట్ర డిజిపిగా నియమించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈయన నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎపి డిజిపీగా మాలకొండయ్య ఇవాళ పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో నూతన డిజిపి గా ఎవరు నియమితులవుతారో అంటూ ఎపి లో పెద్ద చర్చ జరిగింది. అయితే డిజిపి రేసులో మాత్రం ముఖ్యంగా ఆర్పీ ఠాకూర్ తో పాటు విజయవాడ కమీషనర్ గౌతమ్ సవాంగ్ ప్రధాన పోటీలో నిలిచారు. అయితే సీఎం చంద్రబాబు అనుభవం, పనితీరు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఠాకూర్ నియామకానికే ఓకే చెప్పారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఉత్తర్వులు జారీ చేసింది. 

డిజిపిగా నియమితులైన రామ్ ప్రవేశ్ ఠాకూర్ 1986 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలీస్ శాఖలో కీలక పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఎసిబి డిజీ గా పనిచేస్తున్నారు. ఈయన డీజిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో చాలామంది అవినీతి అధికారుల భరతం పట్టారు.  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా ఠాకూర్ మొదటి నియామకం జరిగింది. ఆ తర్వాత ఆయన పలు జిల్లాలకు ఏఎస్పీగా, ఎస్పీగాను విధులు నిర్వర్తించారు. అలాగే హైదరాబాద్ డిసిపిగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల ఐజీగాను పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అధికారుల పంపకాల్లో ఈయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయారు. అక్కడి మొదట విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పనిచేసి, 2016 లో అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిజిపిగా నియమితులయ్యే వరకు ఇదే హోదాలో కొనసాగారు. 

ఇప్పటివరకు ఎపి డిజిపిగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాలకొండయ్య ఇవాళ పదవీ విరమణ పొందారు. ఆయనకు మంగళగిరి లోని 6వ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్ పోలీస్ దళాలు గౌర వీడ్కోలు పలికాయి. 

loader