హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందని ఆమె అన్నారు.  కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలని ఆమె అన్నారు. పప్పు అంటే ఇన్నిరోజులు విటమిన్‌ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు.

 గత నాలుగేళ్లలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మీరు గొప్పలు చెప్తే పచ్చ పత్రికలు అదే విషయాన్ని రాశాయని, కానీ కేవలం 16,900 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని నివేదికల్లో తేలిందని ఆమె గురువారం మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీకి వస్తే ఆయన కాళ్లు పట్టుకోవడానికే మంత్రి దేవినేని ఉమను చంద్రబాబు పంపించారని, గతంలో ఆడా.. మగా ఎవరు అని దేవినేనిని కేసీఆర్‌ ప్రశ్నించారని ఆమె అన్నారు. 

కళా వెంకట్రావు లేఖలోని ప్రతి లైన్‌కు వివరణ ఇస్తామని, టీటీడీని భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని, సంబంధం లేని వ్యక్తులను టీటీడీలో చేర్చి శ్రీవారి ఆగ్రహానికి గురైంది కూడా చంద్రబాబేనని అన్నారు. సంబంధం లేని వాళ్లను టీటీడీలో సభ్యులుగా చేశారని, పొరుగురాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిని చేశారని అన్నారు.

తాము ఏ రోజూ బీజేపీతో కలవలేదనీ కలుస్తామని చెప్పలేదని, అమిత్‌ షా వస్తే రమణ దీక్షితులు వెళ్లారని చెప్పి ఆయనను ప్రధాన అర్చకులు పదవి నుంచి తొలగించారని రోజా అన్నారు.నాలుగేళ్లు కేంద్రలోని బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఎందుకు ఆధారాలు చూపించలేక పోయారని ఆమె ప్రశ్నించారు.

కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏరువాక చేస్తున్న చంద్రబాబుపై రైతులు పోరువాక చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు ఏరువాక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ చంద్రబాబును ఎవరు నమ్మరని అన్నారు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. రైతులకు రూ.87వేల కోట్లు బాకీపడ్డ చంద్రబాబు బాండ్లు అంటూ వాళ్లను మభ్యపెట్టే యత్నం చేశారని, ఆ బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని అన్నారు.

 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా పాలిస్తున్నారో తెలుస్తోందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని రోజా అన్నారు. పచ్చ దొంగలు అమరావతిని భ్రష్టుపట్టించినట్లే షికాగోలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో తాను పోరాడితే.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను రక్షించుకునేందుకు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఏడాదిపాటు తనను అసెంబ్లీ రాకుండా నిషేధం విధించారని అన్నారు. 

టీడీపీ నేత సజ్జా బుజ్జి గౌతమి అనే యువతిని నమ్మించి పెళ్లిచేసుకుని ఆపై హత్యచేశాడని, గౌతమి చెల్లెలు పావని పోరాటంతో టీడీపీ నేతలే హంతకులు అని, వారి హస్తం ఉందని తేలిందని చెప్పారు. ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకున్నప్పుడు ఆమెపై టీడీపీ నేత చింతమనేని దాష్టీకానికి పాల్పడగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావని ఆమె అభిప్రాయపడ్డారు.