Asianet News TeluguAsianet News Telugu

ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు.. 9న ఇద్దరు సాక్షుల హాజరుకు సమన్లు...

ఓబుళాపురం మైనింగ్ కేసులో శుక్రవారం నిందితులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. 

Registration of charges in OMC case, Summons for appearance of two witnesses on 9th
Author
First Published Oct 29, 2022, 10:08 AM IST | Last Updated Oct 29, 2022, 10:08 AM IST

హైదరాబాద్ :  ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులపై శుక్రవారం సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మినహా ప్రధాన నిందితులు బి.వి.శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.  రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి లపై అభియోగాలను నమోదు చేస్తూ సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి  సిహెచ్ రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409,468,471లతో కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాల నమోదు చేపట్టారు. నిందితుల తరపు న్యాయవాదులు  ఉమామహేశ్వరరావు, ఏం రాజేష్, జి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో శ్రీలక్ష్మి హైకోర్టు  నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందినందున, ఆమెతో పాటు తమ పిటిషన్లపై కూడా అభియోగాల నమోదు వాయిదా వేయాలని కోరారు.

దీనికి సి.బి.ఐ కోర్టు నిరాకరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం, జీవోలో క్యాప్టివ్ మైనింగ్ అన్న పదాన్ని తొలగించడం,లీజుల నిమిత్తం జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాంతానికి, జీవోలో పేర్కొన్న ప్రాంతానికి తేడా ఉండడంతో అక్రమ తవ్వకాలకు అవకాశం కల్పించాలని సిబిఐ ఆరోపించిందని అభియోగాల నమోదు ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఓబులాపురం మైనింగ్ కేసు:డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

‘అనంతపురం జిల్లా డీహీరేహాళ్ మండలంలో 93 హెక్టార్లకు మైనింగ్ నోటిఫికేషన్ జారీ చేయగా కుట్రలో భాగంగా ఓఎంసీతో పాటు గాలి మామ ఏర్పాటు చేసిన వినాయక మైనింగ్ కంపెనీ కూడా దరఖాస్తు చేసింది. 23 దరఖాస్తులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా 68.5 హెక్టార్ల లీజు పొందడానికి అప్పటి గనుల శాఖ సహాయ డైరెక్టర్ లింగారెడ్డి సేకరించారు. ఓఎంసీకి పోటీగా ఉన్న కంపెనీలను తప్పించడానికి వినాయక మైనింగ్ కంపెనీతో పోల్చి ఓఎంసీని ఎంపిక చేసినట్లు రాజగోపాల్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. బ్రహ్మణి స్టీల్స్  అవసరాలకు అని పేర్కొన్నప్పటికీ జీవోలో మాత్రం క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఖనిజ రవాణాకు  అధికారులు జారీ చేసిన పర్మిట్ల ఆధారంగా.. కర్ణాటకలో  అక్రమంగా తవ్విన  ఖనిజాన్ని తరలించారు’ అని సిబిఐ పేర్కొంది.  

వీటి ఆధారంగా అభియోగాలు నమోదు చేసినట్లు  న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభియోగాల నమోదు సందర్భంగా నిందితులైన బి.వి. శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, వి.డి. రాజగోపాల్, కృపానందం, మెఫజ్ అలీఖాన్ లు హాజరయ్యారు. 3, 4వ సాక్షులైన తపాలా ఏకాంబరం, హెచ్.మల్లికార్జున్ లకు న్యాయమూర్తి సమన్లు జారీ చేస్తూ విచారణ నవంబర్ 9కి వాయిదా వేశారు.

హైకోర్టు నుంచి శ్రీలక్ష్మి స్టే ఉత్తర్వులు
ఓఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. తనకు ఈ కేసు నుంచి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్  పిటిషన్ను సీబీఐ కోర్టు ఈ నెల 17న కొట్టివేసింది. దాన్ని సవాలు చేస్తూ శ్రీ లక్ష్మీ హైకోర్టులో వేసిన పిటిషన్ పై జస్టిస్  సి హెచ్ సుమలత విచారణ చేపట్టారు. సిబిఐ తరఫు న్యాయవాది సిబిఐ తరఫు న్యాయవాది అనారోగ్యం కారణంగా వాదనలు వినిపించ లేకపోవడంతో విచారణను నవంబరు ఒకటికి వాయిదా వేశారు.  అప్పటి వరకు శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు చేపట్టరాదు అంటూ సీబీఐ కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. డిశ్చార్జి పిటిషన్ ను కొట్టేసిన సీబీఐ కోర్టు అభియోగాల నమోదు ప్రక్రియ నిమిత్తం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీంతో శ్రీ లక్ష్మీ గురువారం హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఈ నేపథ్యంలో ఆమెపై అభియోగాలు నమోదు చేయలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios