విజయవాడ: కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. టిడిపి నాయకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును స్థానిక  పోలీసులు సీజ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న కొల్లు రవీంద్రని  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కొల్లు రవీంద్రకు చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన రవీంద్రపై ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు. 

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ విద్వంసం సృష్టిస్తుంది. చూస్తుండగానే కరోనా కేసులు వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. అయితే... ప్రస్తుతం ఏపీలో కరోనా తాకిడి కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

 రాత్రి 9గంటల నుంచి ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా వచ్చాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం.

ఢిల్లీకి వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు సర్వే పూర్తి చేశారు. 6289 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 1750 మంది స్వీయ నిర్బంధంలో ఉంచారు. రోజుకు వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.