అమరావతి: విశాఖపట్నం పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస రావు మండిపడ్డారు. చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించడం చంద్రబాబుకు, ఆయన కుమారుడు నారా లోకేష్ కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆయన శుక్రవారంనాడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

పోలీసులను ఉద్దేశించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బెదిరింపులు మానుకోవాలని ఆయన చంద్రబాబును, లోకేష్ ను కోరారు. విశాఖపట్నంలో నిరసనకారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులను ఉద్దేశించి చందర్బాబు గాడిదలను కాస్తున్నారా అని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పోలీసులు కాస్తున్నది శాంతిభద్రతలను అని, గాడిదలను కాదని ఆయన అన్నారు.

Also Read: సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టు

సమాజంలో అకస్మాత్తుగా చెలరేగే అనివార్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సందర్భానుసారం, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారనే విషయం చంద్రబాబుకు తెలియకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ఆయన అన్నారు.

ఎటువంటి హాని వాటిల్లకుండా చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలిచి ఉన్న పోలీసులను సంగతి చూస్తా అంటు అంటూ బెదిరించడం ఎంత వరకు సమంజసమవి ఆయన అడిగారు. మేం అధికారంలోకి వస్తే వదిలిపెట్టం అంటూ నారా లోకేష్ బెదిరించే ధోరణిలో మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.

Also Read: విశాఖలో బాబు వెనక్కి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్ పిటిషన్