పేరుకి అతనో ఉపాధ్యాయుడు. తన వద్ద చదువుకునే విద్యార్థులకు మంచేదో, చెడేదో నేర్పించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అలాంటి వ్యక్తి తానే దారి తప్పాడు. ఒకరికి తెలీకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ.. నిత్య పెళ్లికొడుకు హోదాలో బతికేస్తున్నాడు. అందులోనూ... తన ఉద్యోగం చూపించి.. తానో సంఘ సంస్కర్త అనే భావన వారిలో కలిగించి..  పేద యువతులను పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా... అతని రెండో భార్య ద్వారా గుట్టంతా బయటకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్‌ వల్లూరుకు చెందిన మహమ్మద్‌ బాజీ అలియాస్‌ షేక్‌ బాజీ అదే గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.

మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత వేరే కాపురం పెడతానని చెప్పి విజయవాడలో ఓ గది తీసుకొని అక్కడకు మకాం మార్చాడు. ప్రతి ఆదివారం ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. ఆ తరువాత మొహం చాటేయడంతో బాధితురాలు ఆరా తీయగా.. నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో వివాహం చేసుకుని రహస్య కాపురం చేస్తున్నాడని తెలిసింది. 

Also Read వేంపెంటలో చిరుత కలకలం: గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు...

ఈ విషయంలో ఆమె అతనిని నిలదీసింది. దీంతో.. తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమెకు అబార్షన్ కూడా అయ్యింది. ఆ రోజు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత నెలకు ఒకసారి రావడం ప్రారంభించాడు. 

పెద్దలు గట్టిగా నిలదీయడంతో తన ఆస్తుల్ని రెండో భార్య పేరిట రాస్తానని, ఇకనుంచి జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించాడు. ఇదిలావుండగా.. ఇటీవల దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల మైనర్‌ బాలిక తల్లిదండ్రులకు రూ.30 వేలు ఇచ్చి ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. 

కాగా, బాజీ మొదటి భార్య బతికే ఉందని, అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్టు బాధితురాలికి తెలిసింది. బాజీపై తక్షణమే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ విజయారావు తెనాలి డీఎస్పీకి ఆదేశాలిచ్చారు.