విశాఖ నగరంలో రహస్యంగా నడుపుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. గెస్ట్ హౌస్లు, లాడ్జిల్లో గత కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొద్ది రోజులుగా విశాఖ పోలీసులు.. అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటళ్లు, లాడ్జిలపై దాడులు నిర్వహించారు.

ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి డాబాగార్డెన్స్‌ వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీప విశాఖ ఇన్‌ లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న వారిని నగర డీసీపీ–1 రంగారెడ్డి అరెస్ట్‌ చేయగా.. నిన్న బుధవారం రాత్రి సీతమ్మధారలోని శ్రీసాయి గెస్ట్‌ హౌస్‌లో ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తించి సీజ్‌ చేశారు.

ఈ గెస్ట్‌హౌస్‌ యాజమాని దుబాయ్‌లో ఉండడంతో మేనేజరే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారించి, ఓ యువతితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్‌ చేయడం తెలిసిందే. తాజాగా గురువారం త్రీటౌన్‌ సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై అశోక్‌ చక్రవర్తి బీచ్‌ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. పాండురంగాపురం బీచ్‌ గెస్ట్‌ హౌస్‌తో పాటు బీచ్‌ రోడ్డులో ఉన్న కింగ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఎస్‌కేఎంఎల్‌ అతిథి గృహాల పేరిట ఉన్న ఆరు ఫ్లాట్లపై దాడులు చేశారు. వీటిల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించి వాటిని సీచ్‌ చేశారు. పాండురంగాపురం బీచ్‌ గెస్ట్‌హౌస్‌తో పాటు ఆరు ఎస్‌కేఎంఎల్‌ ఫ్లాట్లను సీజ్‌ చేశారు.