అతని కంటపడిన ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. తెలిసిన వాళ్ల దగ్గర నుంచి అందరిపై తన మాయాజాలం ప్రదర్శిస్తాడు. మంచివాడిలా నటించి ఫోన్ నెంబర్ సేకరిస్తాడు. ఆ తర్వాత ప్రేమగా మాటలు కలుపుతాడు. వారిపై వలపు వల విసిరుతాడు. ఆ తర్వాత చాలా తెలివిగా వాళ్ల దగ్గర నుంచి నగ్న చిత్రాలు సేకరిస్తాడు. ఇక అక్కడి నుంచి తన విశ్వరూపం చూపిస్తాడు. తన కోరిక తీర్చాలంటూ వారిని వేధిస్తాడు. తీర్చకుంటే నగ్నచిత్రాలు ఇంటర్నెట్ లో పెడతానంటూ బ్లాక్ మొయిల్ చేస్తాడు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వింజమూరుకు చెందిన ప్రశాంత్‌ ఎమ్మెస్సీ చదివాడు. పరిచయస్తులు, స్నేహితుల ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్‌నంబర్లు సేకరించి వారితో పరిచయాలు పెంచుకుంటాడు. అనంతరం నీవంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వారిని తన వలలో చిక్కుకునేలా చేస్తాడు. 

వ్యక్తిగత, ప్రైవేట్‌ చిత్రాలు సేకరించి తన కోర్కె తీర్చాలని వారిపై ఒత్తిడి తెస్తాడు. మాట వినకపోతే ప్రైవేటు చిత్రాలను ఇంటర్నెట్‌లో పోస్టుచేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసి వారిని లొంగదీసుకుని తన వాంఛ తీర్చుకోసాగాడు.

అతని మాయలోపడి ఎందరో మహిళలు, యువతులు ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో ఉదయగిరికి చెందిన ఓ యువతి ప్రశాంత్‌ మోసాలపై దిశ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ఫోన్‌ పరిశీలించగా కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. 

మెయిల్‌లో మహిళలు, యువతుల నగ్నచిత్రాలు, చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను గుర్తించారు. ఎనిమిది మంది అమ్మాయిలను మోసం చేసిన ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారని డీఎస్పీ తెలిపారు. అతని ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల కల్లబొల్లి మాటలకు లొంగిపోయి వ్యక్తిగత చిత్రాలు షేర్‌ చేయవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా మహిళలు, యువతులకు సూచించారు.