Asianet News TeluguAsianet News Telugu

భర్త కళ్లెదుటే గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్...ఆ చట్టం ప్రయోజనమేంటి?: పవన్ ఆగ్రహం

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టామంటూ ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమయ్యిందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

pawan kalyan reacts on velugodu gang rape
Author
Amaravathi, First Published Aug 4, 2020, 1:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టామంటూ ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమయ్యిందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని... ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ లభించడం లేదన్నారు. 

''గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని శివాపురం తండాలో గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేయడం అమానవీయం. ఆ ఘటన గురించి తెలుసుకొంటేనే హృదయం ద్రవించింది. మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అని పవన్ తెలిపారు. 

''అటవీ భూమిని సాగు చేసుకొంటున్న గిరిజన కుటుంబంపై కిరాతకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ భూమిని తనఖా పెట్టుకోవడమే చట్టరీత్యా నేరం. ఆ భూమిని స్వాధీనం చేసుకొని మంత్రుబాయి కుటుంబాన్ని ఆ భూమిలోకి అడుగుపెట్టకుండా చేశారని తెలిసింది. గిరిజనులపై ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ, అటవీ భూములను గుప్పిట పెట్టుకొంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అండ ఉండటంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అనే ప్రజల ఆందోళనపై ప్రజాస్వామ్యవాదులు, గిరిజన సంఘాలు దృష్టిపెట్టాలి'' అని అన్నారు. 

read more  కర్నూలు జిల్లాలో దారుణం: భర్తను బంధించి గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్

''కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాగు వంతెన నిర్మాణపనుల దగ్గర పని చేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసింది. భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏమి ప్రయోజనం?'' అని మండిపడ్డారు. 

''మహిళకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. కర్నూలు జిల్లాలో తన బిడ్డ సుగాలీ ప్రీతిపై అత్యాచారం చేసి చంపేశారని ఆమె తల్లి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది. ఆమెకు మద్దతుగా జనసేన కర్నూలులో ర్యాలీ చేస్తే తప్ప కేసును సిబిఐకి అప్పగించలేదు. ప్రతి కేసు విషయంలో చర్యల కోసం ప్రజలకు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు ఉంది'' అని అన్నారు. 

''ఇటీవల రాజమండ్రి దగ్గర ఒక దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చోటు చేసుకొంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకొంటున్నా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించడం లేదు అంటే వారిపై రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది. దళిత వర్గానికి చెందిన మహిళ హోమ్ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు చోటు చేసుకోవడం బాధాకరం. శివాపురం తండా, వెలుగోడు ఘటనలకు బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. వీటికి సంబంధించిన కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios