అమరావతి: పట్టుబట్టి న్యాయస్థానంలో గెలిచి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహాయ నిరాకరణే ఎదురైంది. శుక్రవారంనాడు హైదరాబాదులో తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం విజయవాడలోని కార్యాలయానికి చేరుకున్నారు. 

సొంత కార్యాలయంలోనే ఆయనకు నిరాదరణ ఎదురైంది. సోమవారం విజయవాడలోని కార్యాలయానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదు. సంబంధిత పోలీసు అధికారి సెల్యూట్ చేసి లోనికి తీసుకెళ్లడం వంటి సంప్రదాయాలను పాటించలేదు. 

ప్రోటోకాల్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ ఆయన వచ్చే సమయానికి ఆఫీసుకు రాలేదు. ఆ తర్వాత వచ్చి ఆమె సంజాయిషీ చెబుకున్నట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు మాత్రం పెద్ద యెత్తున వచ్చారు. సిబ్బంది మాత్రం కనిపించలేదు. 

ఒకరిద్దరు పూల బొకే పట్టుకుని మొక్కుబడిగా ఆహ్వానం పలికారు. మీడియా ప్రతినిధులు పలకరించినా కొంత మంది ఉద్యోగులు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వానికి భయపడి ఉద్యోగులు సహాయ నిరాకరణ పాటించినట్లు విమర్శలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇదే విధమైన సహాయ నిరాకరణ ఎదురయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.